Hanamkonda : పుట్టిన రోజు నాడు ఎంజాయ్ చేద్దామని వెళ్లి.. చివరకు స్విమ్మింగ్ ఫూల్లో శవాలుగా..
Hanamkonda : కుమార్తె పుట్టిన రోజు నాడు సరదాగా గడుపుదామని వెళ్లిన మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అనూహ్య రీతిలో స్విమ్మింగ్ ఫూల్లో శవాలుగా తేలారు.
in hanamkonda mother and two daughters drown to death in swimming pool
- హనుమకొండలో తీవ్ర విషాదం
- స్విమ్మింగ్ ఫూల్లో పడి తల్లి, కుమార్తెలు మృతి
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
Hanamkonda : హనుమకొండ జిల్లా ఐనవోలులో తీవ్ర విషాదకర సంఘటన వెలుగుచూసింది. కుమార్తె పుట్టినరోజు నాడు.. బయటకు వెళ్లి సరదాగా గడిపి వద్దామనుకున్న వారు చివరకు శవాలుగా మారారు. తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద రీతిలో స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతులకు ఉమేరా (8), అయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి కుటుంబం స్థానికంగా ఉన్న ఓ వెంచర్‌లోని స్విమ్మింగ్ పూల్‌ను నడుపుకుంటూ జీవించేవారు.
అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లి సరదాగా గడిపేవారు. ఈ క్రమంలో కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఫర్హత్, ఉమేరా, అయేషా స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారు స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం.. ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అయితే వీరి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య, ఇద్దరు కుమార్తెలు.. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందినట్లుగా భర్త అజారుద్దీన్ చెబుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితమే ఫర్హత్ మూడోసారి గర్భం దాల్చిందని.. ఈ విషయంలో దంపతులకు గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో అజారుద్దీనే వారిని హత్య చేసి ఉంటాడని ఫర్హత్ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి అలీ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
