నుమాయీష్ అగ్నిప్రమాద ఘటన : నిజాల వేట

హైదరాబాద్ నాంపల్లి నుమాయీష్ అగ్నిప్రమాద ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 05:54 PM IST
నుమాయీష్ అగ్నిప్రమాద ఘటన : నిజాల వేట

Updated On : February 1, 2019 / 5:54 PM IST

హైదరాబాద్ నాంపల్లి నుమాయీష్ అగ్నిప్రమాద ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు.

హైదరాబాద్ : నాంపల్లి నుమాయీష్ అగ్నిప్రమాద ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల వాస్తవాన్ని తేల్చేందుకు ఇప్పటికే 5దర్యాప్తు బృందాలు నుమాయీష్‌ను సందర్శించాయి. మరో వైపు శనివారం నుంచి నుమాయిష్‌ను తిరిగి తెరవనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో  అగ్ని ప్రమాదానికి గల కారణాలు తేల్చే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు . హైదరాబాద్ క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది ఇప్పటికే ప్రమాద స్ధలంలో సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు.  ప్రమాదం ఎలా  జరిగిందో తేల్చే పనిలో దర్యాప్తు బృందం తలమునకలయింది. ప్రమాద ప్రాంతాన్ని తనిఖీ అధికారుల బృందం పలుమార్లు నిశితంగా పరిశీలించింది.

నాంపల్లి  ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని  ఓ ఏటీఎం సెంటర్లో షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అందరూ భావించడంతో అసలు షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది.. ఏ ప్రాంతంలో జరిగింది?  అగ్ని ఏ దిశగా వ్యాపించింది అన్న అనేక కోణాల్లో దర్యాప్తు జరిపింది. విద్యుత్తు, ఇతరత్రా భద్రతకు సంబంధించి పలు లోపాలు స్పష్టంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

నుమాయిష్‌లో అధికారికంగా 2,500 స్టాల్స్‌ ఏర్పాటు చేసినా… అనధికారికంగా మరికొన్ని స్టాల్స్‌కు ఎలా అనుమతించారన్నదాని పైనా బృందం దృష్టి సారించింది.  ప్రతీ స్టాల్‌కు ఎన్ని కిలోవాట్ల కరెంట్ అవసరం.. వాళ్లు అధికారికంగా తీసుకున్న విద్యుత్ కనెక్షన్లు ఎన్ని అనేవాటిపైనా ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూస్తామని టీఆర్‌ఎస్ నేత ఈటల రాజేందర్, ఎగ్జిబిషన్ కమిటీ సెక్రటరీ  తెలిపారు.

దీంతో పాటు ఎవరైనా వ్యక్తులు లోపల సిగరెట్‌  కాల్చారా లేక అకతాయిల పనా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సిలిండర్ పేలినట్టు పెద్దపెద్ద శబ్ధాలు వినిపించాయని తెలిసింది. అయితే వంట చేసుకునే సిలిండర్లను స్టాల్స్‌లోకి ఎందుకు అనుమతించారో తేలాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు భారీ ప్రమాదంతో మూతపడ్డ నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15తో నుమాయిష్ ఆఖరి తేదీగా ప్రకటించినప్పటికీ బాధితులకు అండగా ఉండేందుకు మరో నాలుగు రోజులు పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు.