సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో నిందితుడు హేమంత్ అరెస్టు

హైదరాబాద్ KPHB లో సంచలనం కలిగించిన ఐటీ సంస్థ నిర్వాహకుడు సతీష్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సతీష్ ను నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను గుల్బర్గా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సతీష్ హత్యకు ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రియాంక అనే ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదాలే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన సతీష్ బాబు ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుండేవాడు. పలు కోచింగ్ సెంటర్‌లలో విద్యార్థులకు తరగతులను బోధించడంతోపాటు కన్సల్టెన్సీ కూడా నిర్వహించేవాడు. స్నేహితుడైన హేమంత్‌ను పార్టనర్ గా చేసుకుని… క్లాస్ వర్క్‌లో సతీష్.. ట్రైనింగ్ వర్క్‌లో హేమంత్ ఉమ్మడి సేవలు అందించేవారు. కాగా…సతీష్ హత్య కావడం.. హేమంత్ పరారు కావడంతో అతనే నిందితుడుగా నిర్ధారించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి.
ఐటీ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్న ప్రియాంక అనే యువతికి సతీష్ తరగతులు బోధించగా హేమంత్ ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరితో ప్రియాంక స్నేహంగా, చనువుగా ఉండేది. హేమంత్ ప్రియాంకతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె కోసం ఏకంగా తన కుటుంబాన్ని దూరంగా పెట్టి.. ఆఫీసు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. గత కొద్ది రోజులుగా సతీష్‌తో ప్రియాంక చనువుగా ఉండటాన్ని తట్టుకోలేని హేమంత్ పగ పెంచుకుని.. సతీష్ ను అడ్డుతొలగించుకునేందుకు హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.