Vinutha Driver Murder Case: జనసేన నేత వినూత డ్రైవర్ హత్యకు కారణం ఇదే.. పోలీసుల వెల్లడి..
సీసీ ఫుటేజ్ ద్వారా మృతదేహాన్ని తీసుకొచ్చిన కారును గుర్తించాము. తద్వారా ఐదుగురిని అరెస్ట్ చేశాం.

Vinutha Driver Murder Case: సంచలనం రేపిన శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును శ్రీకాళహస్తిలోనే హత్య చేసి చెన్నై శివారు కాలువలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ థాసన్ లను అరెస్ట్ చేశామన్నారు.
ఈ నెల 8న చెన్నైలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డ్ వెనుక కూవం నది కాలువలో రాయుడు మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల వివరాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతుడు రాయుడు ఒంటిపై జనసేన గుర్తుతో పాటు వినూత పేరుతో పచ్చబొట్టు గుర్తించారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి
శ్రీకాళహస్తి ఘటనపై చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ మీడియాతో మాట్లాడారు. ”సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ వద్ద నాలుగు రోజుల క్రితం మాకు ఒక మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. సీసీ ఫుటేజ్ ద్వారా మృతదేహాన్ని తీసుకొచ్చిన కారును గుర్తించాము. తద్వారా ఐదుగురిని అరెస్ట్ చేశాం. జనసేన పార్టీకి చెందిన వినూతతో పాటు మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నారు. వారు నేరాన్ని అంగీకరించారు.
తమ రాజకీయ ప్రత్యర్థులకు డ్రైవర్ రాయుడు కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేసే వాడని, ఈ కారణంగానే అతడిని హత్య చేసినట్లు నిందితులు చెబుతున్నారు. వైద్య అవసరాల కోసం తరచుగా చెన్నైకి వచ్చేవారని, ఈ రూటు బాగా తెలిసినందు వల్లే మృతదేహాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి పడేశామని నిందితులు చెబుతున్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు జరగాల్సి ఉంది” అని చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ చెప్పారు.