జయరాంను చంపింది రాకేష్.. శిఖాచౌదరికి సంబంధమే లేదు

తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడగడంతో దానికి నిరాకరించిన జయరామ్‌ను రాకేశ్ రెడ్డి హత్యచేసినట్లు కృష్టా జిల్లా ఎస్పీ త్రిపాఠీ తెలిపారు. ఏ1 నిందితుడిగా రాకేశ్ రెడ్డిని, ఏ2గా అతని ఇంటి వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వివరాల ప్రకారం.. హంతకుడు రాకేశ్ రెడ్డి.. జయరామ్‌కు రూ.2.5కోట్లు ఒకసారి, మరో సారి రూ.1.5కోట్లు అప్పుగా ఇచ్చాడు. వడ్డీతో కలిపి రూ.6కోట్లు ఇవ్వాలని జయరామ్ పై రాకేశ్ ఒత్తిడి తెచ్చాడు.
కొద్దికాలం కిందటే డబ్బులు ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడు. కానీ, ఇంటిపై బ్యాంకు లోను ఉండడంతో అది సాధ్యపడలేదు. హత్య జరిగిన రోజు వాట్సాప్‌లో రాకేశ్ చాట్ చేసి జూబ్లీహిల్స్ లోని ఓ ఇంటికి రమ్మని పిలిపించాడు. డబ్బులు ఇవ్వాలని పలు రకాలుగా బెదిరించాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో జయరామ్‌ను తీవ్రంగా కొట్టారు. దాంతో జయరామ్ మృతి చెందాడు.
శ్రిఖా చౌదరికి రాకేశ్ రెడ్డికి పరిచయం ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ కేసులో ఆమెకు సంబంధం ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఈ విషయంపై లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఈ మేర డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మృతుని మామ ఫిర్యాదు మేర దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.