ఉన్మాదం : ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో దాడి

ఉన్మాదం : ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో దాడి

Updated On : February 6, 2019 / 5:47 AM IST

హైదరాబాద్‌: బర్కత్‌పురలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. భరత్ అనే వ్యక్తి ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వెంటబడుతున్నాడు. కొన్ని రోజులుగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆ విద్యార్థిని ఎంతకీ ఒప్పుకోకపోవడంతో క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బర్కత్‌పుర ప్రాంతంలో ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం కొబ్బరి బొండాల కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ యువతిని చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు.

 

బాధితురాలు మధులిక ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఆమెకు పొరుగింట్లోనే ఉంటున్న భరత్.. తనను ప్రేమించాలని మధులిక వెంట పడ్డాడు. మధులిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు జనవరిలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. భరత్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో ఎంతకీ మార్పు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దారుణంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఎందుకు ప్రేమించవంటూ హింసించే స్థాయికి చేరాడు.

ఉన్మాదిగా మారిన భరత్.. ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం మధులిక కాలేజీకి వెళ్తున్న సమయంలో వెంటపడ్డాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. వేధించాడు. దీనికి మధులిక ఒప్పుకోలేదు. ప్రేమ లేదని స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భరత్.. కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. భరత్ దాడిని గమనించిన మధులిక.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా వదల్లేదు. వెంట పడి.. పరుగెత్తి మరీ నడిరోడ్డుపైనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలికి మెడ భాగంపై తీవ్ర గాయమైంది. చేతి నాలుగు వేళ్లు తెగిపోయాయి. స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.