అందరూ చూస్తుండగానే.. గొడ్డలితో నరికాడు

  • Published By: madhu ,Published On : April 15, 2019 / 08:15 AM IST
అందరూ చూస్తుండగానే.. గొడ్డలితో నరికాడు

జగిత్యాల జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి విచక్షణారహితంగా గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. పట్టణంలోని సారుగమ్మ వీధిలో తిప్పర్తి కిషన్ అనే వ్యక్తిపై.. లక్ష్మణ్ ఈ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కిషన్‌ను ఆసుపత్రికి తరలించారు. తల, నడుము, మోచేతి భాగాల్లో గొడ్డలి గాయాలు అయ్యాయి. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

జగిత్యాల టౌన్ లోని విద్యానగర్‌లో 2 గుంటల భూమి విషయంలో కిషన్‌ – లక్ష్మణ్ మధ్య వివాదం ఉంది. రిజిస్ట్రేషన్, డబ్బుల విషయంలో తగాదా నడుస్తోంది. ఈ భూమి విషయంలో నష్టపోయానని భావించిన లక్ష్మణ్.. కిషన్ పై పగ పెంచుకున్నాడు. 2019, ఏప్రిల్ 15వ తేదీ సోమవారం సారుగమ్మ వీధికి లక్ష్మణ్ వచ్చాడు. ఆ సమయంలో కిషన్ బైక్ దగ్గర నిలబడి ఉన్నాడు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఒక్కసారిగా కిషన్ పై దాడి చేశాడు లక్ష్మణ్. గొడ్డలితో నరికాడు. రద్దీగా ఉండే వీధిలో అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి దిగాడు లక్ష్మణ్. ఇంత దుర్మార్గంగా.. నడిరోడ్డుపై గొడ్డలితో నరుకుతుంటే అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

ఓ వ్యక్తి బైక్ పై అలాగే కూర్చుని ఉన్నాడు. ఒకరిద్దరు ఆపే ప్రయత్నం చేద్దామని ముందుకు వచ్చినా.. చేతిలోని గొడ్డలి చూసి భయపడిన వెనక్కి తగ్గారు. తీరిగ్గా కిషన్ ను గొడ్డలితో నరికిన తర్వాత.. లక్ష్మణ్ బైక్‌పై వెళ్లిపోయాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు.. వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.