Tamil Nadu : ప్రియురాలి కోసం దొంగగా మారిన ప్రియుడు-భార్య బంగారం అమ్మికారు గిఫ్టు
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.

tamilnadu
Tamil Nadu : వివాహేతర సంబంధాలలో ప్రియురాలి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే వ్యక్తులను చూశాము.. ఆ క్రమంలో ఆస్తులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే… తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తు నగర్ కు చెందిన శేఖర్ (40) అనే వ్యక్తి స్వీట్ స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి భార్య మల్లికతో కొద్దిరోజుల క్రితం మనస్పర్ధలు వచ్చి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఇరువైపులా బంధువులు రాజీ కుదిర్చి ఆమెను మళ్లీ శేఖర్ వద్దకు తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో తన 300 సవర్ల బంగారు నగలు ఉంచింది.
ఇటీవల ఆ నగలు మాయం అయ్యాయి. బీరువా తనిఖీ చేయగా శేఖర్ తల్లికి చెందిన మరోక 200 సవర్ల బంగారం, రెండు బంగారు బిస్కట్లు మాయం అయినట్లు తెలుసుకున్నారు. దీంతో శేఖర్ తన సోదరుడిని అడుగగా తనకేమీ తెలియదని అతను సమాధానం చెప్పాడు. దీంతో వారు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శేఖర్ ఇంటికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. బీరువాను పరిశీలించారు. బీరువా పగల కొట్టకుండా లోపల ఉన్న నగలు మాయం అయ్యాయి అంటే అది ఇంటి దొంగల పనే అని అనుమానించారు.
ఇంట్లో ఒక్కోక్కరిని ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో శేఖర్ ప్రవర్తన అనుమానం వచ్చి అతడిని తమదైన శైలిలో ప్రశ్నస్తూ విచారణ చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలు దొంగతనం చేశానని శేఖర్ ఒప్పుకున్నాడు. అందులో కొన్నిటిని ప్రియురాలు స్వాతికి ఇచ్చానని… కొన్ని నగలు అమ్మి స్వాతికి కారు గిఫ్టుగా ఇచ్చానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వేళచ్చేరికి చెందిన శేఖర్ ప్రియురాలు స్వాతిని కుడా అరెస్ట్ చేసి వారి నుంచి కారు సీజ్ చేశారు.
శేఖర్ తో విబేధాలు వచ్చి అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్ళిన సమయంలో శేఖర్ కు స్వాతి అనే యువతితో పరిచయం అయ్యింది. వీరి స్నేహం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ఒక హోటల్ లో తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బులు తీసుకుంది. అందులో భాగంగానే కారు, నగలు కోరింది. ప్రియురాలు అడిగిందే తడువుగా శేఖర్ ఇంట్లోని భార్య నగలు కొన్ని స్వాతికి ఇచ్చాడు. మిగిలిన బంగారం అమ్మి కారు కొని స్వాతికి గిప్ట్ గా ఇచ్చాడు.
పోలీసులు స్వాతి, శేఖర్ లను అరెస్ట్ చేసి వారి నుంచి కారు సీజ్ చేసారు. కాగా స్వాతి గురించి ఎంక్వైరీ చేయగా ఆమెకు గతంలోనే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె గతంలో ఏమైనా మోసాలు చేసిందా అనే విషయం విచారిస్తున్నారు. శేఖర్ ను కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించారు.