మావోల అలజడి:ఉనికి కోసం గ్రామాల్లో యత్నాలు

హైదరాబాద్: మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. అన్నల అలజడితో ఏజెన్సీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. గత పది రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదే తరుణంలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తమ ఉనికికోసం రెచ్చిపోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపురం మండలంలోని సూరవీడు గ్రామ చెరువు దగ్గర పని చేస్తున్న ప్రొక్లెయినర్‌ను మావోయిస్టులు తగులబెట్టారు. చెరువు వద్దకు వచ్చిన మావోలు కాంట్రాక్టర్ ఎక్కడంటూ ఆరా తీశారు. కాంట్రాక్టర్ ఆచూకీ తెలియకపోవడంతో ప్రొక్లెయినర్‌ను తగులబెట్టారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరు, మల్లెలమడుగులో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. అమాయక ప్రజలపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో బంధించడాన్ని నిలిపివేయాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఒకవైపు మావోయిస్టుల కదలికలు మరోవైపు పోలీసుల తనిఖీలతో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.