నర్సాపూర్ లో వివాహిత కిడ్నాప్ డ్రామా

Married woman kidnap drama, medak district : హైదరాబాద్ ఘట్కేసర్ ప్రాంతంలో బీ ఫార్మశీ విద్యార్ధిని కిడ్నాప్ నాటకం కేసు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మెదక్ జిల్లా నర్సాపూర్ లో వివాహిత మహిళ కిడ్నాప్ అంశం కలకలం రేపింది. తీరా అది చివరికి నాటకం అని తేలింది.
నర్సాపూర్ లో నివసించే మస్కత్ బేగం(30) అనే మహిళ ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి శనివారం, ఫిబ్రవరి13న తన ఏడాది వయసున్న కుమారుడిని తీసుకుని బయటకు వచ్చింది.మధ్యాహ్నమైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో భర్త అజ్జూ, అతని సోదరి ఆమెకు ఫోన్ చేశారు. తనను, తన కుమారుడ్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విఛ్చాఫ్ అయ్యింది.
భర్త అజ్జూ వెంటనే స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్ పోలీసులను అలర్ట్ చేశారు. వారు ఆమె సుచిత్ర ప్రాంతంలో అమె ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడ్నించి ఆమెను నర్సాపూర్ పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు.
మహిళను విచారించగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని… కొద్ది రోజులుగా భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు వివరించింది, భార్యా, భర్తలకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.