ప్రేమను అంగీకరించలేదని తల్లితండ్రులను హత్యచేసిన మైనర్ బాలిక

Minor girl arrested for killing parents over relationship with boyfriend : తన ప్రేమను అంగీకరించలేదని ప్రియుడితో కలిసి తల్లితండ్రులను హత్య చేసిన మైనర్ బాలిక ఉదంతం మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. ప్రతిరోజు ఉదయం పక్కింట్లో ఉండే కోడలు తనకు టీ పంపించక పోయేసరికి ఆ పెద్దాయన తన మనవడిని… కొడుకు ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన కొడుకు తల్లి, తండ్రులు రక్తపు మడుగులో హత్యకు గురై ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే వెళ్లి తన తాతకు విషయం చెప్పాడు. తాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఉండాల్సిన మైనర్ బాలిక కనపడకపోవటం గుర్తించారు. ఆమె తప్పిపోయిందా… లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అంశంలో పోలీసులకు సందిగ్దత ఏర్పడింది. ఆమె తప్పిపోయినట్లు భావించారు. కానీ…. మరణించిన హెడ్ కానిస్టేబుల్, తండ్రి కనపడకుండా పోయిన తన మనవరాలు, ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి పరారీలో ఉన్న నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండోరో లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసే వ్యక్తి మైనర్ కుమార్తె, రత్లాం కు చెందిన 22 ఏళ్ల ధనుంజయ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఒక రోజు డ్యూటీ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తన కుమార్తె ప్రియుడితో కలిసి వెళ్లటాన్ని గమనించాడు. ఇంటికి వచ్చాక బాలికతో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు వద్దని మందలించాడు. తల్లి తండ్రులు తన ప్రేమను అంగీకరించక పోయేసరికి బాలికకు కోపం వచ్చింది. అప్పటి నుంచి బాలిక తన తల్లి తండ్రులతో మాట్లాడకుండా మౌన పోరాటం చేయసాగింది. అయినా తల్లి తండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు.
పెద్దలు తన ప్రేమను అంగీకరించలేదు కనుక…ఆమె తన ప్రియుడితో కలిసి తల్లితండ్రులను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. బుధవారం, డిసెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ధనుంజయ్ తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ప్రియుడ్ని ఇంట్లోకి తీసుకువచ్చి…. ఇంట్లో ఉన్న కుక్క మొరగకుండా, ఆమె కుక్కను బయటకు తీసుకు వెళ్లింది.
ఇంట్లోకి ప్రవేశించిన ధనుంజయ్ నిద్రపోతున్న హెడ్ కానిస్టేబుల్ ను, అతని భార్యను తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. వారిద్దరూ అక్కడికక్కడే నిద్రలో ప్రాణం విడిచారు. మరణించారని ధృవీకరించుకున్నాక ప్రియురాలికి ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ యువతి కుక్కను తీసుకుని ఇంటికి వచ్చి కట్టేసింది. అనంతరం ప్రేయసి ప్రియులిద్దరూ ఇంటినుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.