Suicide : పరువు కోసం తల్లి.. ప్రేమ కోసం కూతురు…

Mother And Daughter End Her Life
Mother and daughter ends her life due to love affair : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కూతురు మరోకరిని ప్రేమించటం ఇష్టంలేని తల్లి కూతుళ్లు గొడవపడ్డారు. మొగుడుకన్నా ప్రేమించిన వాడే ఎక్కవని కూతురు … కూతురువ్యవహారం నచ్చని తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవటంతో పండుగ పూట ఆ ఇంట్లో విషాధ చాయలు అలుముకున్నాయి.
పాత గుంటూరుకు చెందిన నాగవర్ధిని అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దివ్యశ్రీసాయిని(20) వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేక పెదకూరపాడు మండలంలోని బుస్సాపురం గ్రామానికి చెందిన తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసింది.
భార్యగా వచ్చిన మేనకోడల్ని ఆమె ఇష్ట ప్రకారమే చదివిస్తున్నాడు భర్త. దివ్యశ్రీసాయి సత్తెన పల్లిలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా… ఆమె భర్త సత్తెనపల్లిలోనే ఒక ఇనుము, సిమెంట్ షాపులో పని చేస్తున్నాడు.
రోజూ దంపతులిద్దరూ 25 కిలోమీటర్లు సొంతూరు నుంచి సత్తెనపల్లికి వచ్చి వెళుతుండేవారు. ఉదయం భార్యను కాలేజీ వద్ద దించి తాను షాపు కు వెళ్లేవాడు. సాయంత్రం కాలేజీ అయ్యేసరికి వచ్చి భార్యను తీసుకుని బుస్సాపురం వచ్చేవాడు.
ఈ క్రమంలో ఏప్రిల్ 10 వ తేదీన పరీక్ష ఉండటంతో భార్యను కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ వద్దకు భార్య కోసం రాగా ఆమె కనిపించ లేదు. భార్య గురించి ఆమె స్నేహితులను విచారించగా… ఆమెతో కలిసి చదువుతున్న వ్యక్తిని ప్రేమిస్తోందని… అతడితో కలిసి వెళ్లిందని చెప్పారు.
ఈ విషయాన్ని గుంటూరులో ఉన్న తన అక్క నాగవర్ధనికి చెప్పాడు. ఈ క్రమంలో దివ్యసాయిశ్రీని ప్రేమించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పెళ్లయిన అమ్మాయితో ప్రేమ ఏమిటని ఆ వ్యక్తిని మందలించారు. దివ్య సాయిశ్రీ తమ వద్దే ఉందని నాగవర్ధని కుటుంబ సభ్యులకు వారు సమాచారం ఇచ్చారు.దీంతో నాగవర్ధని కూతురు వద్దకు వచ్చింది.
పెదకూరపాడు పోలీసు స్టేషన్‌లో పోలీసులు ఇరువైపుల వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. కుమార్తె దివ్యసాయిశ్రీని తీసుకుని నాగవర్ధిని సోమవారం తమ్ముడి ఇంటికి వచ్చింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సోమవారం రాత్రి దివ్యసాయిశ్రీ, నాగవర్ధిని ఇంటిపై నిద్రించారు. దివ్యసాయిశ్రీ భర్త అతని తల్లి ఇంటికి వెళ్లాడు.
మంగళవారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో తన బాబాయ్ తో కలిసి ఇంటి పైకి వెళ్లేసరికి అక్కడ తల్లి,కూతుళ్లు ఇద్దరూ అచేతనంగా పడి ఉన్నారు. వారివద్ద నుంచి పురుగుల మందు వాసన రావటంతో స్ధానికుల సహాయంతో వారిని పెదకూరపాడు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు లేకపోవటంతో వారిని సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి కూతురు మరణించారని వైద్యులు తెలిపారు. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.