బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు.. ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన నిందితుడు.. బుల్డోజర్‌తో బార్ కూల్చివేత

బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా మద్యం సేవించిన బార్‌ను అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు.

బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు.. ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన నిందితుడు.. బుల్డోజర్‌తో బార్ కూల్చివేత

Mumbai BMW Hit And Run case updates Mihir Shah sent to 7 days police custody

Mumbai BMW Hit And Run case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాకు కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 16 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశిలిచ్చింది. హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించుకునేందుకు మిహిర్ షా చాలా ప్రయత్నాలు చేశాడని, అతడిని ప్రశ్నించేందుకు వీలైనన్ని ఎక్కువ రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు. దీంతో అతడికి కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

ప్రియురాలికి 40 సార్లు ఫోన్
మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన తర్వాత మిహిర్ షా తన ప్రియురాలికి ఫోన్ చేసినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. తన కారును ఘటనాస్థలంలోనే వదిలేసి ఆటోలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి అతడు దాక్కున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిహిర్ షా ప్రియురాలిని కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

బుల్డోజర్‌ ట్రీట్‌మెంట్‌
జుహు ప్రాంతంలో ఉన్న వైస్ గ్లోబల్ తపస్ బార్ అక్రమ నిర్మాణాలను బుల్డోజర్‌తో అధికారులు కూల్చివేశారు. యాక్సిడెంట్ చేయడానికి ముందు ఈ బార్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి మిహిర్ షా పీకల దాకా మద్యం సేవించినట్టు సమాచారం. ఏకంగా 18 వేల రూపాయలు బిల్ చేసినట్టు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లఘించి మద్యం సరఫరా చేశారనే ఆరోపణలతో బార్ యాజమానిని అరెస్ట్ చేశారు. తాజాగా బార్ కూడా సీజ్ చేశారు.

మిహిర్ షా తండ్రికి బిగ్ షాక్
శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన మిహిర్ షా తండ్రి రాజేశ్ షాకు పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తప్పించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్వయంగా ప్రకటించారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని సీఎం వార్నింగ్ ఇచ్చారు. మిహిర్ షాను తప్పించేందుకు ప్రయత్నించిన అతడి తల్లి, చెల్లెళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : ముచ్చుమర్రిలో దారుణం.. భారీగా పోలీసుల మొహరింపు.. అసలేం జరిగింది?

మిహిర్ షా ఏం చేశాడు?
వర్లీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో తన బీఎండబ్ల్యూ కారుతో స్కూటర్‌ను ఢీకొట్టి కావేరి నఖ్వా(45) అనే మహిళ మరణానికి కారణమయ్యాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారును ఆపకుండా ఆమెను 1.5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. కారు టైరులో చిక్కుకుపోయిన ఆమెను అవమానవీయంగా రోడ్డుపై పడేసి పరారయ్యాడు. మృతురాలి భర్త ప్రదీప్ నఖ్వా గాయాలతో బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారు ఆపివుంటే తన భార్య ప్రాణాలు దక్కేవని ప్రదీప్ పేర్కొన్నారు. “కారు వెనుక అర కిలోమీటరు దూరం పరిగెత్తాను, కానీ మృతదేహాన్ని కనుగొనలేకపోయాను. నేను ఏడుస్తున్నాను, అరుస్తున్నాను, కానీ అతను ఆగలేదు. అతను ఒక్క సెకను ఆగి ఉంటే, ఏమీ జరిగేది కాద”ని కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లో ప్రిన్సిపల్ పాడు పని, మహిళా టీచర్‌తో అలా..

నేరం ఒప్పుకున్న మిహిర్
తానే యాక్సిడెంట్ చేశానని పోలీసుల విచారణలో మిహిర్ షా ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వెల్లడించాడు. అయితే తాను మద్యం మత్తులేనని అతడు అన్నట్టు తెలిసింది. యాక్సిడెంట్ చేసి పారిపోయిన మిహిర్ షా పోలీసులు తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు హెయిర్, బియర్డ్ కటింగ్ చేయించుకున్నాడని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు ఆరోపించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడి కుట్రను బయటపెట్టారు.