New Orleans Attack : న్యూ ఓర్లీన్స్ ఉగ్రదాడి.. కొత్త సంవత్సరం వేడుకల్లో మారణహోమం.. షంసూద్ దిన్ జబ్బార్ ఎవరు?

New Orleans Attack : న్యూ ఇయర్ వేడుకల మధ్య ఓ మాజీ అమెరికన్ సైనికుడు న్యూ ఓర్లీన్స్‌లో మారణహోమానికి పాల్పడ్డాడు. ఇస్లామిక్ స్టేట్ జెండా ఉన్న ట్రక్కుతో జనంపై దూసుకెళ్లి 15 మందిని బలితీసుకున్నాడు.

New Orleans Attack : న్యూ ఓర్లీన్స్ ఉగ్రదాడి.. కొత్త సంవత్సరం వేడుకల్లో మారణహోమం.. షంసూద్ దిన్ జబ్బార్ ఎవరు?

New Orleans Attack

Updated On : January 2, 2025 / 7:25 PM IST

New Orleans Attack : నూతన సంవత్సర వేడుకల్లో మునిగిన న్యూ ఓర్లీన్స్ నగరంలో ఒక్కసారిగా విధ్వంసం చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ జెండాతో కూడిన పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ విధ్వంసర ఘటనలో 15 మంది మృతి చెందగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా మరో 30 మంది గాయపడ్డారు.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జెండాతో పికప్ ట్రక్కును నడుపుతున్న షంసుద్-దిన్ జబ్బార్ అనే అమెరికా మాజీ సైనికుడు ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. అదే సమయంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఉగ్రదాడికి సంబంధించిన భయంకరమైన రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read Also : అమెరికాలో ఘోరం.. జనాలపైకి ట్రక్కును ఎక్కించిన డ్రైవర్‌.. 10 మంది మృతి.. 30 మందికి గాయాలు

ఉగ్రవాద దాడి లేదా కుట్ర? :
ఎఫ్‌బీఐ దాడిని తీవ్రవాద సంఘటనగా పరిశోధిస్తోంది. దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా లేడని నమ్ముతున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. పరిశోధకులకు వాహనంలో తుపాకులు, ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్), అలాగే నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్‌లో ఇతర చోట్ల పేలుడు పరికరాలను కనుగొన్నారు. ఈ ఘటనపై విచారణ ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దీనికి సంబంధించి అనుమానితుడి పూర్తి వివరాలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.

ఎవరీ షంసుద్-దిన్ జబ్బార్.. :
ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి టెక్సాస్‌కు చెందిన అమెరికా పౌరుడు షంసుద్-దీన్ జబ్బార్ (42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. జబ్బార్ 2007లో ఆర్మీలో చేరాడు. అక్కడ అతను మానవ వనరులు, సమాచార సాంకేతిక విభాగంలో పనిచేశాడు. 13 ఏళ్లు అమెరికా సైన్యంలో పనిచేశాడు. 2009 నుంచి 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో మోహరించాడు. 2015లో, రిజర్వ్ ఫోర్స్‌కు బదిలీ అయ్యాడు. 2020లో స్టాఫ్ సార్జెంట్ హోదాతో సైన్యాన్ని విడిచిపెట్టాడు. తన ఆర్మీ సర్వీసుకు ముందు, జబ్బార్ ఆగష్టు 2004లో నేవీలో చేరాడు.

కానీ, ఒక నెలలోనే బయటకు వచ్చేశాడు. ఈ మధ్య కాలంలో జబ్బార్ వరుస వ్యాపారాల్లో కొనసాగాడు. జబ్బార్ ఐదేళ్ల వివాహం తర్వాత 2022లో విడాకులు తీసుకున్నట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జబ్బార్ దంపతులకు ఒక బిడ్డ పుట్టాడు. టెక్సాస్ రికార్డుల ప్రకారం.. జబ్బార్‌పై 2002లో చోరీకి పాల్పడి 2005లో చెల్లని లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినందుకు అరెస్టయ్యాడని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అతని రికార్డులో హింసాత్మక నేర చరిత్రకు సంబంధించిన సూచనలు లేవు.

దాడికి కొన్ని గంటల ముందు.. జబ్బార్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ప్రేరణ పొందానని, ఉగ్రదాడికి పాల్పడనున్నట్టు తెలిపాడు. డ్రైవర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను ఎఫ్‌బీఐ గుర్తించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆ దాడిని “నీచమైన, హేయమైన చర్య”గా పేర్కొన్నారు.

ఎఫ్‌బీఐ తీవ్రవాద గ్రూపులతో సంబంధాలపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది. “జబ్బార్ మాత్రమే బాధ్యుడని మేం నమ్మడం లేదు” అని ఎఫ్‌బీఐ అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ అలెథియా డంకన్ విలేకరుల సమావేశంలో అన్నారు. లూసియానా స్టేట్ పోలీస్ ఇంటెలిజెన్స్ బులెటిన్ ప్రకారం.. రిమోట్ పేలుడు కోసం రూపొందించిన రెండు పైపు బాంబులతో సహా జబ్బర్ తన ట్రక్కులో అనేక పేలుడు పదార్థాలను దాచిపెట్టాడు.

అత్యంత ఘోరమైన ఐఎస్-ప్రేరేపిత దాడి :
సామూహిక హింసాకాండలో వాహనం ఆయుధంగా ఉపయోగించారనేందుకు ఈ దాడి మరో ఉదాహరణ. గత సంవత్సరాల్లో అమెరికా గడ్డపై ఐఎస్ ప్రేరేపిత దాడిలో ఇది అత్యంత ఘోరమైన దాడిగా చెబుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా పెరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాద ముప్పు గురించి ఎఫ్‌బీఐ హెచ్చరించింది. గత సంవత్సరంలో, ఏజెన్సీ ఇతర దాడులను నిరోధించింది. గత అక్టోబరులో ఓక్లహోమాలో ఎన్నికల రోజు భారీ జనసమూహాన్ని లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినందుకు ఒక ఆఫ్ఘన్ వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!