నంద్యాలలో ‘అబ్దుల్ సలాం’ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!

Sheikh Abdul Salam Family Suicide Case : నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
అబ్దుల్ సలాం ఇంకా అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అని తెలుస్తోంది.
తమ మృతికి కారణం పోలీసులే అంటూ వారు ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
ఆ వీడియోలో తాము ఏ తప్పు చేయలేదని.. దొంగతనానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ తీవ్ర ఆవేదనతో తెలిపారు.
టార్చర్ భరించలేక పోతున్నానని.. తమకు సాయం చేసే వారు ఎవరూ లేరని.. మా చావుతో అయిన మీకు మనశ్శాంతి కలుగుతుందని అనుకుంటున్నాను సార్.. అంటూ తీవ్ర ఆవేదనతో చెప్పాడు అబ్దుల్ సలాం.
నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి వేధింపులు తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు అబ్దుల్ సలాం తల్లి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం నెలకొంది. గూడ్స్ రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నంద్యాల వాసులుగా గుర్తించారు.
పాపం ఎవరిది?.. వేధింపులే కారణమా?
అబ్దుల్ సలాం బంగారం దుకాణంలో గుమాస్తాగా పని చేసేవాడు. తనకు తెలిసిన వారితో అగ్రి గోల్డ్ డిపాజిట్లు చేయించాడు.
కంపెనీ బోర్డు తిప్పేయడంతో పరువు కాపాడుకునేందుకు తన ఆస్తి అమ్మేసి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాడు.
గత ఏడాది నవంబర్ 7వ తేదీన అతడు పని చేస్తున్న దుకాణంలో బంగారం చోరీ చేశాడని నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అప్పట్లో అతని నుంచి 500 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. చివరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అక్కడ కూడా అతడిని విధి చిన్నచూపు చూసింది.
రెండు రోజుల క్రితం అతడి ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి 70 వేలు పోగొట్టుకున్నాడు.
ఆ కేసులో విచారణ కోసం పోలీసులు ఈ నెల 2నఅబ్దుల్ సలాంను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు.
ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకోవడమే కాకుండా… భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీదనుంచి గూడ్స్ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.
కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ఘటనలో అబ్దుల్‌సలాంతో పాటు భార్య నూర్జహాన్, కుమార్తె సల్మా, కుమారుడు దాదా ఖలంధర్‌తో కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు.
అబ్దుల్‌సలాం భార్య నూర్జహాన్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. మంగళవారం ఉదయం పిల్లల్ని స్కూల్ వద్ద దింపుతానని చెప్పిన అబ్దుల్ సలాం.. భార్యాబిడ్డలతో కలిసి నంద్యాల నుంచి తన ఆటోలో బయలుదేరాడు.
కానీ.. స్కూల్‌కు వెళ్లకుండా అంతా కలిసి కౌలూరు గ్రామంలోని రైలు పట్టాల వద్దకు చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అబ్దుల్ సెల్ఫీ వీడియో బయటికి వచ్చాక పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పోలీసులు ఈ ఆత్మహత్యలకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.