నిర్భయ కేసు నిందితుల ఉరిపై సుప్రీంలో విచారణ

నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ నటరాజ్ మాట్లాడుతూ.. రివ్యూ పిటిషన్, క్యురేటివ్, క్షమాభిక్ష అభ్యర్థన వంటి న్యాయపరమైన హక్కులు అన్నింటినీ ముగ్గురు దోషులు వినియోగించుకున్నప్పటికీ వాళ్లను ఉరి తీయలేని స్థితిలో తీహార్ జైలు అధికారులు ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయాలంటూ కేంద్రం పిటిషన్‌లో పేర్కొన్నదని ఈ కేసుకు సంబంధించిన ఓ న్యాయవాది పేర్కొన్నారు. ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనలను రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ఇదివరకే తిరస్కరించారు. ఇక నలుగురు దోషుల్లో మిగిలిన పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయలేదు.
తొలుత ఉరి అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని అధికారులకు సూచిస్తూ.. శిక్ష అమలు నిలుపుదల కోసం వారం రోజుల్లోగా తమకు ఉన్న చట్టపరమైన అన్ని అవకాశాలను దోషులు వినియోగించుకోవాల్సిందిగా గడువునిచ్చింది. అనంతరం అధికారులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు సూచించింది. మరోవైపు నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి కొత్త డెత్‌వారెంట్లు జారీ చేయాల్సిందిగా తీహార్ జైలు అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించారు.