ఢిల్లీ బాబా రాసలీలలు : గుప్త ప్రసాదం పేరుతో యువతులతో శృంగారం

ఆధ్మాత్మిక ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బాబాలెందరో… అలాంటి కోవకే చెందుతాడు బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్! ఢిల్లీ కేంద్రంగా తనని తాను శ్రీకృష్ణుడి అవతారమని చెప్పుకుంటూ భక్తులను మాయ చేస్తున్నాడు. 2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయించినవారిని రక్షిస్తానని చెప్పుకొంటూ అమాయక భక్తుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ వీరేంద్రబాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాబా మాయాజాలంలో పలువురు అమ్మాయిలు కూడా చిక్కుకుని బయట ప్రపంచానికి దూరమయ్యారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సంతోషి రూప కూడా వీరేంద్ర బాబా ఉచ్చులో చిక్కుకుంది. అమెరికాలో నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్న సంతోషి.. 2015లో అకస్మాత్తుగా అదృశ్యమమైంది. ఆమె తల్లిదండ్రులు కూతురు గురించి ఆరా తీయగా.. ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ స్థాపించిన ఆధ్మాత్మిక విద్యాలయ ఆశ్రమంలో చేరినట్లు తెలిసింది.
సంతోషి రూప సన్యాసిలా మారిపోవడాన్ని చూసి పేరెంట్స్ ఆవేదనకు లోనయ్యారు. ఇంటికి వచ్చేందుకు సంతోషి రూప నిరాకరించేదని వారు చెప్పారు. ‘నేను దేవతగా మారబోతున్నా. మీరందరూ త్వరలో మరణిస్తారు. మళ్లీ మేం మానవ జాతిని సృష్టించి విశ్వాన్ని స్థాపిస్తాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ సంతోషి వింతగా మాట్లేదని పేరెంట్స్ వాపోయారు.
Also Read | ఢిల్లీ అల్లర్లు : జాతీయగీతం పాడుతూ ప్రాణాలు వదిలిన నవయువకుడు
దీంతో వీరేంద్ర బాబా ఆశ్రమం నుంచి కూతుర్ని విడిపించేందుకు సంతోషి పేరెంట్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సంతోషికి మాయమాటలు చెప్పి ఆశ్రమంలో చేర్చుకున్నారని, ఆమెలాంటి యువతులు 168 మంది ఆశ్రమంలో ఉన్నారని వారి తరపు లాయర్ వాదించారు. వీరేంద్రపై అత్యాచారం కేసులున్నాయని, సీబీఐకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడని కోర్టుకు తెలిపారు.
సంతోషి అమెరికా నుంచి ఇండియా వచ్చే నాటికి ఆమె బ్యాంకు అకౌంట్లో కోటి రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బును ఆశ్రమ నిర్వాహకులే కాజేసి ఉంటారని సంతోషి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వీరేంద్ర దేవ్‌పై ఉన్న కేసులను ఢిల్లీ పోలీసులు సీబీఐకి బదలాయించారు.
2018 జనవరిలో వీరేంద్ర దేవ్ దీక్షిత్ అక్రమాలపై సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. అతడిపై రెండుసార్లు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరేంద్ర బాబా కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ కూడా జారీ చేసింది. అతడి ఆచూకి తెలిపితే 5 లక్షల నజరానా ఇస్తామని సీబీఐ ప్రకటించింది. రెండేళ్లుగా వీరేంద్ర దేవ్ పరారీలో ఉన్నా అతడి ఆశ్రమం ఇంకా నడుస్తుండటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2017లో కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వీరేంద్ర దేవ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటైన ఒక బృందం ఈ ఆశ్రమంపై దాడిచేయగా బాబా బాగోతం బయటపడింది. ఆ ఆశ్రమంలో మహిళలు, యువతులను ఇరుకిరుకు గదుల్లో జంతువుల్లా బందీలుగా ఉన్నారు. తనిఖీల్లో ఇంజక్షన్లు, కొన్ని రకాల మందులు దొరకడం కలకలం రేపింది. 67 మంది అమ్మాయిలను బాబా నుంచి విముక్తి కల్పించారు.
వీరేంద్ర దేవ్ బాబాకి దేశవ్యాప్తంగా ఆశ్రమాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ‘ఆధ్మాత్మిక ఐశ్వర్య విశ్వవిద్యాలయ్’ పేరిట ఆశ్రమం ఉంది. ఏ ఆశ్రమానికి వెళ్లినా ‘గుప్త ప్రసాదం’ పేరుతో 10 మంది అమ్మాయిలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని బాబా బాధితులు చెబుతున్నారు. ఆ రాత్రి బాబాతో గడిపిన అమ్మాయిలను రాణులుగా పిలుస్తారని అతని ఉచ్చు నుంచి బయటపడ్డ అమ్మాయిలు వెల్లడించారు. వీరేంద్ర దేవ్ బాబా పట్టుబడితే ఆశ్రమంలో జరిగిన అరాచకాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.