ఫేస్ బుక్ పట్టించింది : భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధపడ్డాడు
భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఓ ప్రబుద్ధుడి యత్నం ఫేస్‌బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది.

భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఓ ప్రబుద్ధుడి యత్నం ఫేస్‌బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్ నగర్ : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఓ ప్రబుద్ధుడి యత్నం ఫేస్‌బుక్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ యువతితో జరిగిన నిశ్చితార్థం చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అతనికి ఇంతకుముందే పెళ్లయిందనే గుట్టురట్టయింది. దీంతో వనపర్తి పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అస్పల్లిగూడకు చెందిన నల్లవల్లి కిశోర్‌రెడ్డి(30) హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని భవానీనగర్‌లో నివాసముంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన గుంపుమేస్త్రీ హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె బీటెక్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉండగా..2015లో కిశోర్‌రెడ్డికి పరిచయమైంది. అదే ఏడాది వారు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకొన్నారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లింది. అక్కడి నుంచే భర్త కిశోర్‌రెడ్డికి వీసా కోసం ప్రయత్నిస్తే తిరస్కరణకు గురైంది. ఆమె ప్రతినెలా రూ.1.50 లక్షలు భర్తకు పంపడంతోపాటు నాగోల్‌లో రూ.45 లక్షలు విలువచేసే ఫ్లాట్‌ను ఆయన పేరున కొనుగోలు చేసింది. భార్య పంపే డబ్బులతో జల్సాలకు అలవాటు పడిన కిశోర్‌రెడ్డి మరో యువతితో స్నేహం చేయగా తర్వాత అది చెడింది.
రెండు, మూడు నెలల కిందట హైదరాబాద్‌లో ఒక శుభకార్యంలో కిశోర్‌రెడ్డికి వనపర్తికి చెందిన యువతి పరిచయమైంది. ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. స్వగ్రామంలో భూములున్నాయని, హైదరాబాద్‌లో పలు వ్యాపారాలున్నాయని, ద్విచక్రవాహనాల షోరూం తనదేనంటూ కార్యాలయంలో కూర్చొని కాగితాలపై సంతకాలు చేసినట్లు కిశోర్‌రెడ్డి నటించాడు. ఇదంతా నిజమని నమ్మిన యువతి తరఫువారు గతనెలలో వనపర్తిలో నిశ్చితార్థం చేశారు. రూ.20 లక్షల కట్నం, 25తులాల బంగారం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.10లక్షల నగదు, కొంత బంగారం ఇచ్చారు.
ఈ నిశ్చితార్థం చిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో అమెరికాలో ఉంటున్న కిషోర్ రెడ్డి భార్యకు విషయం తెలిసింది. ఆమె వెంటనే వనపర్తి వారికి అసలు విషయం చెప్పడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కిశోర్‌రెడ్డి వనపర్తి యువతి పేరున రూ.3లక్షల బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఒక ద్విచక్రవాహనాన్ని కొన్నాడు. యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై జములప్ప శనివారం తెలిపారు.