Haryana Student Arrest: భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కి కీలక సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్..

పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు దేవేంద్ర సింగ్ కు భారీ డబ్బు ఇచ్చి లోబరుచుకున్నారు.

Haryana Student Arrest: భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కి కీలక సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్..

Updated On : May 17, 2025 / 5:35 PM IST

Haryana Student Arrest: గూఢచర్యంతో పాటు కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన కాలేజీ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు దేవేంద్ర సింగ్ ధిల్లాన్. వయసు 25 ఏళ్లు. కైతాల్ కు చెందిన దేవేంద్ర.. పాటియాలా ఖలాసా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. మే 12న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ అకౌంట్ లో పిస్టల్స్, గన్స్ ఫొటోలను అతడు అప్ లోడ్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. దేవేంద్ర సింగ్ థిల్లాన్ గతేడాది నవంబర్ లో కర్తార్ పూర్ కారిడార్ గూండా పాకిస్తాన్ వెళ్లినట్లు విచారణలో తెలిసింది. అక్కడ పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో అతడికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు దేవేంద్ర సింగ్ కు భారీ డబ్బు ఇచ్చి లోబరుచుకున్నారు.

దేవేంద్ర సింగ్ ద్వారా భారత్ కు చెందిన కీలక సమాచారం సేకరించారు పాక్ అధికారులు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ ఫొటోలను కూడా అతడు పాక్ అధికారులకు షేర్ చేశాడని గుర్తించారు. పోలీసులు అతడి ఫోన్ సీజ్ చేశారు. ఫోరెన్సిక్ దర్యాఫ్తునకు పంపించారు. అంతేకాదు అతడి బ్యాంక్ ఖాతాపై ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్ అధికారులతో అతడు జరిపిన లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు.

”భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలో పాక్ ఏజెన్సీకి దేవేంద్ర సింగ్ సమాచారం ఇచ్చాడని తేలింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు దేవేంద్ర సింగ్ కీలక సమాచారం చేరవేశాడు. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేశాం. దేవేంద్ర సింగ్ పంజాబ్‌లోని ఓ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు” అని పోలీసులు తెలిపారు.

Also Read: సాయం చేసిన భారత్‌ను కాదని.. పాకిస్తాన్‌పై తుర్కియేకు అంత ప్రేమ ఎందుకు? బలమైన కారణాలేంటి..

గూఢచర్యం, సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవలే పోలీసులు 24 ఏళ్ల నౌమన్ ఇలాహీని పానిపట్ లో అరెస్ట్ చేశారు. అతడు ఉత్తరప్రదేశ్ వాసి. హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. భారత్ కు చెందిన కీలకమైన సమాచారం చేరవేసినందుకు అతడికి పాక్ అధికారులు డబ్బు ఇచ్చారు. అతడి బావమరిది, అతడు పని చేసే ఆఫీస్ డ్రైవర్ బ్యాంకు ఖాతాల్లో పాక్ ఏజెన్సీ అధికారులు డబ్బు వేసేవారు.

పంజాబ్ పోలీసులు గత వారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారు ఢిల్లీ హైకమిషన్ లో పని చేస్తున్నారు. భారత్ కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.