Turkiye : సాయం చేసిన భారత్‌ను కాదని.. పాకిస్తాన్‌పై తుర్కియేకు అంత ప్రేమ ఎందుకు? బలమైన కారణాలేంటి..
కష్టకాలంలో ఎంతో పెద్ద సాయం చేసినా.. తుర్కియే భారత్ కు వ్యతిరేకంగా ఎందుకు పని చేసింది?

Turkiye : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో తుర్కియే వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ యుద్ధంలో భారత్ ను కాదని తుర్కియే పాకిస్తాన్ వైపు నిలిచింది. ఆ దేశానికి డ్రోన్లు, ఆయుధాలు, ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలు సరఫరా చేసింది. అంతేకాదు సైనికులను కూడా పంపిందట. తుర్కియే తీరు భారతీయులను ఎంతగానో బాధించింది. భారతీయులు ఎంతో ఆవేదనగా ఉన్నారు.
భారత్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుందని తెలిసినా.. తుర్కియే ఎందుకిలా చేసింది? కష్టకాలంలో పెద్ద సాయం చేసినా.. తుర్కియే భారత్ కు వ్యతిరేకంగా ఎందుకు పని చేసింది? ఇండియా శత్రువు అని తెలిసినా.. పాక్ ను ఎందుకు వెనకేసుకొస్తోంది? అసలు పాక్ పై తుర్కియేకు అంత ప్రేమ ఎందుకు? ఎందుకు అంతగా పాక్ ను సపోర్ట్ చేస్తోంది? దీని వెనుకున్న బలమైన కారణాలు ఏంటి?
భారత్, పాకిస్తాన్‌లకు సంబంధించిన ఏ విషయంలోనైనా పాక్ వైపే నిలుస్తూ వస్తోంది తుర్కియే. ఆ దేశం పాక్ ను సపోర్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై అనేక సందర్భాల్లో పాక్ కు సపోర్ట్ గా మాట్లాడింది తుర్కియే. పశ్చిమ ఆసియాలో పాక్ కు మద్దతిచ్చిన దేశం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ తుర్కియే. ఇతర గల్ఫ్ దేశాలేవీ పాక్ కు మద్దతివ్వడం లేదు.
2023 ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. వేల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తుర్కియే, సిరియాలలో సహాయం, పునరావాసం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద తుర్కియేకు విమానంలో సహాయ సామాగ్రి కూడా పంపింది.
భారత్‌ను మిత్ర దేశంగా, పాకిస్తాన్‌ను సోదర దేశంగా తుర్కియే ఎప్పుడూ చెబుతుంటుంది. అయితే, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తుర్కియే ఎక్కువ సందర్భాల్లో పాక్ వైపే నిల్చుంది.
అసలు తుర్కియే ఎందుకింతలా పాక్ ను సపోర్ట్ చేస్తోంది, పాక్ పై దానికి ఎందుకంత ప్రేమ.. అంటే.. అందుకు బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. సౌదీ అరేబియా, యూఏఈలతో భారత్ కున్న వాణిజ్య సంబంధాలతో పోలిస్తే.. తుర్కియేతో ఉన్న వాణిజ్య సంబంధాలు చాలా తక్కువ. ఒకదాని మీద మరొకటి ఆధారపడి లేవు. అందుకే తుర్కియే వ్యవహారశైలి భిన్నంగా ఉందని విశ్లేషిస్తున్నారు. 1948లో ఇండియా, తుర్కియే మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అనేక దశాబ్దాల తర్వాత కూడా రెండు దేశాలు ఒకదానికొకటి దగ్గర కాలేకపోయాయి.
Also Read: ట్రంప్ మరో షాక్.. అమెరికా నుంచి డబ్బు పంపే NRIలకు ఝలక్..
భారత్, తుర్కియే మధ్య బలహీన సంబంధాలకు రెండు ప్రధాన కారణాలున్నాయి. కశ్మీర్ విషయంలో తుర్కియే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో కారణం కోల్డ్ వార్ సమయంలో తుర్కియే అమెరికా క్యాంపులో ఉంది. భారత్ అలీన విధానాన్ని అవలంబించింది. కశ్మీర్ సమస్య విషయంలో తుర్కియే వైఖరి పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్, తుర్కియే మధ్య సాన్నిహిత్యం పెరగలేదు.
2017లో ఎర్దొవాన్ తుర్కియే అధ్యక్షునిగా భారత పర్యటనకు వచ్చారు. కానీ నరేంద్ర మోదీ తుర్కియేలో ఎప్పుడూ పర్యటించలేదు. మోదీ 2019లో తుర్కియేలో పర్యటించాల్సి ఉంది. కానీ కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితిలో ఎర్దొవాన్ చేసిన ప్రకటన తర్వాత ఆ పర్యటన వాయిదా పడింది. పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నందున తుర్కియేపై భారత్ ఒకింత అసహనంగానే ఉంది.
పాకిస్తాన్ పై తుర్కియేకు అంత ప్రేమ ఉండటానికి బలమైన కారణాలివే..
* ఇస్లామిక్ గుర్తింపు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా బలమైన సంబంధాలు నెలకొనడానికి కారణం.
* సంక్షోభాల సమయంలో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా ఉన్నాయి.
* ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పాక్, తుర్కియే సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, రీజనల్ కోఆపరేషన్ డెవలప్‌మెంట్ వంటి సంస్థల్లో కలిసి ఉన్నాయి.
* సైప్రస్‌లో గ్రీస్‌కు వ్యతిరేకంగా తుర్కియే చేసే ఆరోపణలకు పాక్ మద్దతిచ్చింది. 1964, 1971లలో మిలటరీ సాయానికి హామీ ఇచ్చింది.
* తుర్కియే కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు నిరంతరాయంగా మద్దతిస్తోంది.
* 2019 ఆగస్టు 5న జమ్మకశ్మీర్‌కు భారత్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు, మరుసటి నెలలోనే ఎర్దొవాన్ ఐక్యరాజ్యసమితిలో దీనికి వ్యతిరేకంగా ప్రసంగించారు.
* 2003లో ప్రధాని, 2014లో అధ్యక్షుడైన ఎర్దొవాన్ పాక్ లో 10సార్లకు పైగా పర్యటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ లో పర్యటించినప్పుడు ఆ దేశాన్ని తన రెండో ఇల్లుగా అభివర్ణించారు.
* ఆ పర్యటనలో 2 దేశాలు 24 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 5 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవాలని అంగీకారానికొచ్చాయి.
* గడిచిన రెండు దశాబ్దాలుగా నాటోపై తుర్కియే పట్టు కోల్పోతోంది. దీంతో గత 20 ఏళ్లగా రష్యా, చైనా, పాక్ తో.. తుర్కియే సంబంధాలు పెంపొందించుకుంటోంది. నాటోలో ఏదన్నా జరిగితే పాకిస్తాన్ కూడా తుర్కియేకు ముఖ్యమైన దేశంగా ఉంటుంది.
* ఆయుధాల విషయానికొస్తే ఓవైపు పాశ్చాత్య దేశాలుంటే, ఇంకో వైపు చైనా, తుర్కియే ఉన్నాయి.
* భారత్, పాకిస్తాన్ యుద్ధ సమయంలో తుర్కియే తన ఆయుధాలను పరీక్షించుకుంది. ప్రపంచం మొత్తం తన ఆయుధాలను కొనాలని తుర్కియే భావిస్తోంది.
* భౌగోళికంగా గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వం నుంచి తుర్కియే సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ దేశాల పలుకుబడిని తగ్గించడానికి పాకిస్తాన్, మలేషియా వంటి గల్ఫేతర ముస్లిం దేశాలతో సంబంధాలను తుర్కియే బలపరుచుకుంటోంది.
* దీంతోపాటు హిందూ మహాసముద్రంపై తుర్కియే దృష్టి కేంద్రీకరిస్తోంది.
* ఇటీవలి సంవత్సరాల్లో తుర్కియే నౌకాదళం, పాకిస్తాన్ నేవీ కలిసి హిందూ మహా సముద్రంలో సంయుక్తంగా అనేకసార్లు యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.