Korutla Girl Murder Case: తోడికోడలిని జీవితాంతం ఏడిపించాలనే.. కోపం, అసూయతోనే.. చిన్నారి హితిక్ష హత్య కేసులో వీడిన మిస్టరీ
హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా తన బట్టలు ఊరి బయట గార్డెన్స్ సమీపంలో పెట్టింది.

Korutla Girl Murder Case: తెలంగాణలో సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హితిక్ష హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితురాలు సొంత చిన్నమ్మనే అని తేల్చారు. తోడికోడలు మీద కోపంతో, అసూయతోనే చిన్నారిని చంపినట్టు నిర్ధారించారు. నిందితురాలిని పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నారు.
సొంత చిన్నమ్మనే చిన్నారిని చిదిమేసిందని పోలీసులు తెలిపారు. సెక్షన్ 103/c/1 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు కోరుట్ల పోలీసులు. నిందితురాలిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితురాలిని జగిత్యాల లేదా కరీంనగర్ తరలించే అవకాశాలు ఉన్నాయి. చిన్నారి హత్యకు మమత చాకు, కత్తెర ఉపయోగించింది.
హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా తన బట్టలు ఊరి బయట గార్డెన్స్ సమీపంలో పెట్టింది. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు దుస్తులను వెలికితీశారు. ఈర్ష, అసూయ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. తోడికోడలిని జీవితాంతం ఏడిపించాలనే ఉద్దేశంతోనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో మమత ఒప్పుకుంది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష (5) దారుణ హత్యకు గురైంది. ఆ పాప చిన్నమ్మ (బాబాయ్ భార్య) మమతే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ యాప్‌ల వంటి వాటిలో 30 లక్షల రూపాయలకుపైగా పెట్టి మమత సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది.
దీంతో తోడికోడళ్లు, కుటుంబ సభ్యులు తనను చులకనగా చూడడంతో ఆమె పగ పెంచుకుంది. తనను ఏడిపిస్తున్న వారిని జీవితాంతం ఏడిపించాలనే ఉద్దేశంతో పాపను మమత హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం కరీంనగర్ వెళ్లగా ఇదే అదునుగా హితీక్ష హత్యకు ప్లాన్ వేసింది మమత.
స్కూల్ నుంచి హితీక్ష రావడంతో ఆమెను పక్కింట్లోకి తీసుకెళ్లింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాత్రూంలో కత్తితో చిన్నారిని గొంతు కోసి, హత్య చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా హితీక్షను తానే ఆసుపత్రికి తీసుకెవెళ్లింది.
అయితే, సీసీటీవీ ఫుటేజ్ తో మమత బండారం బట్టబయలైంది. గంటల వ్యవధిలో మమత దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై వారికి అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో పోలీసులు విచారించగా.. మమత నేరాన్ని అంగీకరించింది. పాపను తానే హత్య చేసినట్లు చెప్పింది.