Road Accident Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన టాటా సుమో.. మృతులంతా ఏపీకి చెందినవారే
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు, చిన్నారులు సహా 13 మంది ఈ ప్రమాదంలో మరణించారు.

Road Accident
Karnataka Road Accident : కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై చిక్ బళ్లాపూర్ శివారులో మొబైల్ స్టేషన్ వద్ద ఆగిఉన్న లారీని టాటా సుమో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో సుమోలో మొత్తం 14 మంది ఉన్నారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఆగినఉన్న లారీని టాటాసుమో డ్రైవర్ గమనించక పోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
Also Read : US Mass Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి.. 60మందికిపైగా గాయాలు
గత రెండు మూడు రోజులుగా పొగమంచు రహదారులను పూర్తిగా కప్పేస్తుందని, రహదారిపై పొగమంచు కప్పుకుపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడటం లేదని వాహనదారులు చెప్పారు. ఈ క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో టాటా సుమో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. చిక్ బళ్లాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిక్ బళ్లాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డీఎల్ నగేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా 13 మంది మరణించినట్లు తెలిపారు. ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
ఈ ప్రమాదంలో మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరులో కూలీ పనులకు వెళ్లే కూలీలు. బెంగళూరులో ఉంటున్నారు. దసరా పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి వారు స్వస్థలాలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో వీరు మృత్యువాత పడ్డారు.