రోహిత్ తివారీ హత్య కేసులో కొత్త కోణం

ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పదిరోజుల క్రితం హత్యకు గురైన రోహిత్ తివారీని అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని ప్రచారం జరిగినప్పటికీ ఆపూర్వను విచారించిన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరదలితో రోహిత్ కు ఉన్న సంబంధాలే అపూర్వ రోహిత్ ను హత్య చేయటానికి కారణమని తెలుస్తోంది.
నాలుగు రోజుల పాటు అపూర్వను విచారించిన పోలీసులకు అపూర్య కొత్త విషయాలు చెప్పింది. మరదలితో సన్నిహితంగా ఉండటం సహించలేకే రోహిత్ ను హత్య చేసినట్లు అపూర్వ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మరదలితో సంబంధం విషయంలో తన అత్త ఉజ్వల కూడా రోహిత్ కు మద్దతు తెలిపిందని ఆమె చెప్పినట్లు సమాచారం, హత్య జరిగిన రోజు రాత్రి కూడా రోహిత్ తన మరదలితో ఒకే గదిలో ఉన్నారని…ఇద్దరూ కలిసి మద్యం సేవించారని అపూర్వ విచారణలో చెప్పినట్లు తెలిసింది. హత్య సమయంలో రోహిత్ ధరించిన దుస్తులు, హత్యాప్రదేశంలో ఆనవాళ్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.