టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
టీఎస్ ఆర్టీసీ బస్సు నిర్మల్ నుంచి విజయవాడ వస్తోంది. మార్గంమధ్యలో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర 5 వ నెంబర్ జాతీయ రహదారిపై ఏప్రిల్ 16 మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. మూడు పల్టీలు కొట్టి పంటపోలాల్లోకి దూసుకెళ్లి పడిపోయింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు ప్రారంభమైనప్పటి నుంచి వేగంగా డ్రైవ్ చేశాడని, చెప్పినా వినలేదని ప్రయాణికులు అంటున్నారు. యూటర్న్ లో కూడా బస్సును అతివేగంగా మలిపాడని చెబుతున్నారు.