Serial Killer: మనుషులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసే సీరియల్ కిల్లర్ అరెస్ట్.. వెన్నులో వణుకు పుట్టించే ఆయుర్వేద డాక్టర్ నేర చరిత్ర..

తన ముఠాతో ట్యాక్సీ, లారీ డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. ఆ మృతదేహాలు దొరక్కుండా మొసళ్లకు ఆహారంగా వేశాడు.

Serial Killer: మనుషులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసే సీరియల్ కిల్లర్ అరెస్ట్.. వెన్నులో వణుకు పుట్టించే ఆయుర్వేద డాక్టర్ నేర చరిత్ర..

Updated On : May 21, 2025 / 9:41 PM IST

Serial Killer: అతడో ఆయుర్వేద డాక్టర్. డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడు. దేవుడితో సమానం. కానీ, ఇతడు అందుకు పూర్తిగా భిన్నం. ప్రాణం తీయడమే అతడి లక్ష్యం. 10 కాదు 20 కాదు.. ఏకంగా 100కు పైగా మర్డర్లు చేశాడు. అంతకుమించి దారుణం ఏంటంటే.. చంపేశాక.. మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేశాడు. అలా.. చిన్న ఆధారం కూడా దొరక్కుండా తప్పించుకున్నాడు. ఈ సైకో డాక్టర్ నేర చరిత్ర గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సీరియల్‌ కిల్లర్‌ దేవేంద్ర కుమార్ శర్మ(67) ఎట్టకేలకు దొరికాడు. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 2023 జూన్ లో తీహార్ జైలు నుంచి 2 నెలల పెరోల్‌పై బయటకు వచ్చి అదృశ్యమైన సైకో డాక్టర్ ని రాజస్థాన్‌లోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో మారువేషంలో ఉండగా పట్టుకున్నారు.

ఈ సీరియల్‌ కిల్లర్‌ మనుషులను అతి కిరాతకంగా చంపేవాడు. ఆ తర్వాత మృతహాలను యూపీలోని కాస్‌గంజ్‌లో మొసళ్లకు ఆహారంగా వేసేవాడు. ఢిల్లీ, రాజస్థాన్‌, హరియానాలో నమోదైన ఏడు కేసుల్లో అతడికి జీవిత ఖైదు పడింది. గుర్గావ్ కోర్టు ఈ సైకోకి మరణ శిక్ష కూడా విధించింది.

ఆయుర్వేద డాక్టర్ అయిన దేవేంద్ర శర్మ.. 2002-2004 మధ్య కాలంలో అనేకమంది ట్యాక్సీ, ట్రక్కు డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2023 జూన్ లో పెరోల్‌పై బయటకు వచ్చిన అతడు.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించారు.

Also Read: నన్ను పెళ్లి చేసుకో.. పాకిస్తాన్ ISI ఏజెంట్‌తో చాటింగ్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూట్యూబర్ జ్యోతి లీలలు..

1994లో గ్యాస్ డీలర్‌షిప్ వ్యాపారంలో భారీగా నష్టపోవడంతో నేరాల బాట పట్టాడు దేవేంద్ర శర్మ. అక్రమ అవయవాల వ్యాపారంలోకి ప్రవేశించాడు. 2002-2004 మధ్య తన ముఠాతో కలిసి ట్యాక్సీ, లారీ డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. ఆ మృతదేహాలు దొరక్కుండా ఉత్తరప్రదేశ్‌ కాస్‌గంజ్‌లోని మెసళ్లున్న హజారా కాలువలో ఆహారంగా వేశాడు. డ్రైవర్లను చంపాక ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించే వాడు. చివరికి అతడి పాపం పండింది. 2004లో కిడ్నీ రాకెట్‌, హత్య కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 125కి పైగా అక్రమ కిడ్నీ మార్పిడిలు చేశాడీ సైకో డాక్టర్.

ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పట్టుబడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, పెరోల్‌పై ఉన్న సమయంలో దేవేందర్ శర్మ పరార్ కావడం ఇదే తొలిసారి కాదు. 2020లో 20 రోజుల పెరోల్ తర్వాత తిరిగి జైలుకెళ్లలేదు. 7 నెలలకు ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. 2023 జూన్‌లో సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అతడికి మళ్ళీ 2 నెలల పెరోల్ మంజూరైంది. అనంతరం 2023 ఆగస్ట్‌ 3 నుంచి ఈ ఏడాది మే 19 వరకు ఆ సీరియల్‌ కిల్లర్‌ పరారీలో ఉన్నాడు.