ఘోరం : స్కూల్లోకి చొరబడి.. 8 మంది పిల్లలను చంపేశాడు

చైనాలో దారుణం జరిగింది. హుబెయ్ సెంట్రల్ ఫ్రావిన్స్ లోని బయంగ్ పింగ్ టౌన్ లోని చోటన్గపో ప్రైమరీ స్కూల్ లో క్లాస్ లు ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు కత్తితో చిన్నారులపై దాడి చేశాడు. సోమవారం(సెప్టెంబర్-2,2019) జరిగిన ఈ ఘటనలో 8మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు చిన్నారులను హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిగా అనుమానిస్తున్న 40ఏళ్ల యు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అయితే చైనాలో కొన్నేళ్లుగా స్కూల్ పిల్లలపై ఇలాంటి దాడులు చాలానే జరుగుతున్నాయి. 2014లో స్కూల్ కి వెళ్తున్న నలుగురు చిన్నారులను గొంతుకోసి చంపేసిన ఘటన గ్వాంగ్జి ఫ్రావిన్స్ లో జరిగింది. గతేడాది ఏప్రిల్ లో షాంగ్జి ఫ్రావిన్స్ లోని మిడిల్ స్కూల్ బయట ఆ స్కూల్ మాజీ విద్యార్థి చేసిన దాడిలో 9మంది చనిపోగా,20మందికి పైగా గాయపడ్డారు. అదే ఏడాది జూన్ లో షాంగైలోని ఓ ఎలిమెంట్రీ స్కూల్ బయట ఓ ఆగంతకుడు ఇద్దరు చిన్నారులను గొంతుకోసి చంపేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభంలో రాజధాని బీజింగ్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో సుత్తితో ఓ వ్యక్తి చేసిన దాడిలో 20మంది చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. పాఠశాలల దగ్గర భద్రతపై పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి పాఠశాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.