Software Engineer : ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

భార్యాభర్తల గొడవలో కలగ చేసుకుని సర్ది చెప్పినందుకు ఒక యువకుడు ఇంటి యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

Software Engineer : ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer Killed House Owner

Updated On : June 25, 2021 / 7:50 PM IST

Software Engineer : భార్యాభర్తల గొడవలో కలగ చేసుకుని సర్ది చెప్పినందుకు ఒక యువకుడు ఇంటి యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కానాజీగూడలోని సత్యసాయి ఎన్‌క్లేవ్ ప్రాంతానికి చెందిన డి.మంగతాయారు(75)కు కుమారులు మార్కండయ్య, మల్లి కార్జునరావు, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు.

మార్కండయ్య ఢిల్లీలో ఆర్మీ కల్నల్‌గా పనిచేస్తుండగా.. మల్లికార్జునరావు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెటిలయ్యాడు. కుమార్తె శ్రీలక్ష్మి మంగతాయారు ఇంటికి సమీపంలోనే వేరే ఇంట్లో ఉంటోంది. మంగతాయారుకు మూడు అంతస్తుల భవనం ఉంది. అందులో గ్రౌండ్‌ఫ్లోర్, సెకండ్‌ఫ్లోర్ అద్దెకు ఇచ్చి, ఫస్ట్‌ఫ్లోర్‌లో ఆమె ఒక్కతే ఉంటున్నారు.

గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేరేవాళ్లు ఉంటున్నారు. సెకండ్‌ఫ్లోర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే రాజేష్‌గౌడ్ భార్యా, పిల్లాడితో కాపురం ఉంటున్నాడు. రాజేష్‌గౌడ్‌కు మానసిక సమస్యలతో పాటు ఆర్ధిక సమస్యలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో భార్యను తరచూ వేధిస్తూ ఉండేవాడు. వీళ్లు గొడవపడినప్పుడు మంగతాయారు ఇద్దరికి సర్ది చెప్పేది కొన్నిసార్లు.

భర్త వేధింపులు ఎక్కువై రాజేష్ భార్య పిల్లాడ్ని తీసుకుని 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజేష్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా బాగా కుంగిపోయిన రాజేష్ బుధవారం మధ్యాహ్నం ఇంటి టెర్రస్ పైకి మొక్కలు చూసేందుకు వెళ్తున్న మంగతాయారును…ఇంట్లో నల్లాలు పనిచేయటం లేదని లోపలకు పిలిచాడు. ఆమె లోపలకు రాగానే లాప్‌టాప్ వైరు గొంతుకు బిగించి ఆమెను హత్య చేశాడు.

అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలోకి ఈడ్చుకెళ్లి ఆమె చేతులకున్న నాలుగు బంగారు గాజులు తీసుకుని కుదవ పెట్టాడు. ఆవచ్చిన డబ్బుతో తన అప్పులను తీర్చేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు.  అదేరోజు సాయంత్రం ఢిల్లీలో ఉన్న మంగతాయారు కుమారుడు మార్కండయ్య తన తల్లికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయన వెంటనే తన చెల్లెలుకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె ఇంటి వద్దకు వచ్చి చూడగా తల్లి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె చుట్టు పక్కల వాకబు చేయగా తల్లి ఆచూకి లభించలేదు.

దీంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగతాయారు ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో 3వ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న రాజేష్‌ను ప్రశ్నించగా ముక్తసరిగా సమాధానం చెప్పి తలుపు వేసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి ఇంట్లో గాలించగా బాత్రూంలో కాళ్లు చేతులు కట్టిపడేసి మంగతాయారు విగతజీవిగా కనపడింది.

నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ ఎందుకు హత్య చేశాడో మాత్రం చెప్పట్లేదు. మంగతాయారు అప్పుడప్పుడు అతనికి డబ్బులు చేబదులుగా కూడా ఇచ్చేదని తెలిసింది. తనకున్న అప్పులు తీర్చేందుకు మంగతాయారు బంగారుగాజుల కోసం హత్య చేశాడా…లేక తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవటంతో పగ పెంచుకుని హత్య చేశాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.