లిఫ్టు గుంతలో పడి మహిళ మృతి

హైదరాబాద్: అపార్ట్ మెంట్ లో లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో ఒక మహిళ తనువు చాలించింది. పై అంతస్తు నుంచి కిందకు లిఫ్టు లో వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాద వశాత్తు లిఫ్టు గుంతలో పడి మరణించింది. నారాయణగూడలో గురువారంనాడు ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జియాగూడ కు చెందిన కే.రేఖ (45) అనే మహిళ తెలుగు అకాడమీ సమీపంలోని వివంత గర్ల్స్ హాస్టల్ లో స్వీపర్ గా పనిచేస్తోంది. గురువారం ఉదయం ఎప్పటిలాగే పనిలోకి వచ్చింది. హాస్టల్ గదులు శుభ్రం చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఐదో అంతస్తులోని లిఫ్టు వద్దకు వచ్చి బటన్ నొక్కింది. ఇంతలో లిఫ్టు డోర్ తెరుచుకోవటంతో, కాలు ముందుకు వేసింది. అంతే ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్టు మీద పడిపోయింది. ఐదో అంతస్తు నుంచి కింద పడిన రేఖ తలకు బలమైన గాయం అయ్యింది. వెంటేనే మిగిలిన సిబ్బంది ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె మరణించింది. లిఫ్టు రాకుండానే దాని డోర్ తెరుచుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది. లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో అనేక అపార్ట్ మెంట్ల లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
కాగా.. వివంత గర్ల్స్ హాస్టల్ని శివ అనే వ్యక్తి నడుపుతున్నాడు. రేఖ ఉదయం మద్యం సేవించి విధులకు హజరయ్యిందని అతను ఆరోపించాడు. సాయంత్రం వెళ్లేటప్పుడు మద్యం మత్తులో లిఫ్టును సరిగా గమనించకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని శివ అన్నాడు. మద్యం సేవించి పనిలోకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా విధులు సరిగాచేసింది..కానీ లిఫ్టుని మాత్రం గుర్తించలేక పోయిందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ యాజమానిపైనా, భవన యజమానిపైనా ఐపీసీ 304 ఏ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.