భారీ వర్షాలకు కూలిన భవనం : 15 మంది మృతి

  • Published By: chvmurthy ,Published On : December 2, 2019 / 03:56 AM IST
భారీ వర్షాలకు కూలిన భవనం : 15 మంది మృతి

Updated On : December 2, 2019 / 3:56 AM IST

తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున  3గంటల ప్రాంతంలో   ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి కక్కడే ఫ్రాణాలు విడిచారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగానే భవనాలు కూలినట్లుగా తెలుస్తోంది.  సహాయక చర్యల్లో  ప్రాణాలతో  బయట పడి  కొన ఊపిరితో ఉన్నవారిని కోయంత్తూరు  ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

ఘటన ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉండటంతో సహాయక  చర్యలకు అంతరాయం కలుగుతోంది. గడిచిన 10 రోజులుగా తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  చెన్నైలోనూ పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోరటూరులో ఇళ్లలోని వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.