టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు శేఖర్ అరెస్టు

విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్‌లో నటించిన నటుడు శేఖర్ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే పెయిడ్ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. వరద సమయంలో రైతు వేషం కట్టి తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు. కుడితిపూడి శేఖర్ తన తప్పులను ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
శేఖర్ ప్రభుత్వాన్ని తిట్టిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ కార్యకర్తలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. శేఖర్ చేసిన వీడియోపై తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేసారు. మరోవైపు గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శేఖర్ పై ఫిర్యాదు చేశారు.
శేఖర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వరదలపై ప్రభుత్వాన్ని నిందిస్తూ వీడియో తీసింది ఎవరు.. స్క్రిప్ట్ రాసింది ఎవరు… అన్న అంశాలపై పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ చిత్రీకరించిన పలు యాడ్స్‌లో శేఖర్ నటించాడు. వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి, ఆ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు తెలుస్తోంది.