ఖరగ్ పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య, అసలేం జరిగింది

New Project (11)
వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) ఆత్యహత్య చేసుకున్నాడు. ఆదివారం(ఏప్రిల్ 26,2020) రాత్రి ఉరేసుకున్నాడు. సోమవారం(ఏప్రిల్ 27,2020) హాస్టల్ లోని తన గది తలుపులను కొండలరావు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు తెరిచి చూశారు. కొండలరావు ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడి స్వస్థలం ఏపీలోని విజయనగరం. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్ పూర్ కు బయలుదేరారు. కాగా ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
కొండలరావు మృతి వార్త తెలిసి అతడి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. అతడి ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. బాగా చదువుకుని జీవితంలో పైకి వస్తాడని, తమకు అండగా ఉంటాడని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మరోవైపు హాస్టల్ లోనూ విషాదం నెలకొంది. కొండలరావు స్నేహితులు, తోటి విద్యార్థులు షాక్ లో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణం తెలుసుకునే పనిలో పడ్డారు.