భూవివాదం…మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : September 6, 2020 / 09:41 PM IST
భూవివాదం…మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపేశారు

Updated On : September 6, 2020 / 9:55 PM IST

ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ​ లఖీంపుర్​ ఖేరీ జిల్లాలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా అడ్డగించగా…ఈ క్రమంలో వారు కర్రలతో కొట్టి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మాజీ ఎమ్మెల్యేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అయన ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనలో అయన కుమారుడు కూడా గాయపడ్డారు.

అసలేం జరిగింది

మాజీ ఎమ్మెల్యే .నిర్వేంద్రకు చెందిన భూమిని కిషన్​ కుమార్ గుప్తా అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఆ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అయితే.. గుప్తా తన అనుచరులతో కలిసి ఆదివారం ఆ భూమి వద్దకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న నిర్వేంద్ర..త్రికోలేయ పడువా గ్రామంలోని భూమి వద్దకు వచ్చి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కిషన్ ..నిర్వేంద్రను తీవ్రంగా గాయపరిచాడు. నిర్వేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కుమారుడిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు కిషన్​ కుమార్​ అనుచరులు. నిర్వేంద్ర ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతూ మరణించారు.

నిర్వేంద్ర కుమార్ నిగ్సన్ స్థానం నుంచి 1989,1991లో స్వతంత్ర అభ్యర్థిగా.. 1993లో సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై గెలిచారు. అన్యాయంగా తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని.. అడ్డుకున్న తండ్రి, కొడుకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు. మాజీ ఎమ్మెల్యే మృతిని నిరసిస్తూ స్థానిక​ ప్రజలు ఆందోళనకు దిగారు.

నిర్వేంద్ర హత్య, ఆయన కుమారుడిపై జరిగిన దాడిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్‌ కు గురైందన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్ర ప్రజలు.. శాంతి భద్రతల విషయంలో ఆందోళన చెందటమే కాకుండా భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నా అని అఖిలేష్​ ట్వీట్​ చేశారు.