మూడో కన్నుకే దొరకలేదు : శివాలయంలో నంది విగ్రహం చోరీ

గుడిలో దొంగతనం జరిగిందంటే హుండీ మాయం అయిందని అనుకుటాం లేదా అమ్మవారి పట్టు చీరో, స్వామి వారి నగలో, వెండి పాత్రలో మాయం అయ్యాయి అనుకుంటాం. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో మాత్రం ఏకంగా నందిశ్వరుడి విగ్రహం మాయం చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దొంగతనం జరిగి వారం రోజులు అయింది. మూడు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవు, టన్ను బరువు ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నంది విగ్రహాన్ని ఎందుకు చోరీ చేసారన్న విషయం మాత్రం ఎవరికి అంతుపట్టటం లేదు.
కొందరు నంది ప్రతిష్టా సమయంలో వేసే నవరత్నాల కోసం చేసి ఉంటారని అంటుంటే.. మరికొందరు ప్రత్యేక పుజల కోసం చోరీ చేసుంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు, ఆలయ ప్రాంగణంలో దేవాలయ శాఖా అధికారులు పూర్తి స్థాయిలో రక్షణా ఏర్పాటు చేయకపోవడం వల్లే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
గుడిలో నుంచి దొంగలు బయటకు వచ్చిన తర్వాత రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒక వాహనంలో అర్ధరాత్రి 11 నుంచి 2 గంటల సమయంలో వెళ్తున్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆ వెహికల్ ఎటు వెళ్లింది.. ఎక్కడికి వెళ్లింది అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాలయంలో నంది విగ్రహం చోరీ కాకినాడలో చర్చనీయాంశం అయ్యింది. భక్తుల్లో అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.