Covid-19 : యజమాని ఇంట్లో కరోనా……గుమస్తా దురాశ
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.

Police Recover Rs.5 Crore Worth Stolen Gold, Cash
Covid-19 : నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు. తాను ఉద్యోగం చేస్తున్న యజమాని కుటుంబీకుల్లో ఒకరికి కరోనా సోకింది.
యజమాని వారిని బాగోగులు చూసుకోవటంలో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా సంస్ధలో నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నచిరుద్యోగి ఆ నిమిషంలో విచక్షణ కోల్పోయి చోరీకి పాల్పడ్డాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట హర్ష విజయవాడలోని రాహుల్ జ్యూయలరీ షాపులో గుమాస్తాగా పని చేస్తున్నాడు.యజమాని మహావీర్ జైన్ వద్ద నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇటీవల మహావీర్ జైన్ సోదరుడికి కరోనా సోకింది. సోదరుడిని ఆస్పత్రిలో చేర్పించిన మహావీర్ అక్కడే ఉండి అతని బాగోగులు చూసుకుంటున్నాడు.
జ్యాయలరీ షాపులో వెంకట హర్ష వ్యాపారం చూసుకుంటూ యజమానికి వివరాలు ఇస్తున్నాడు. యజమాని ఆస్పత్రి వద్దే ఉండటం అదునుగా భావించిన వెంకట హర్ష తనలోని అల్ప బుద్దిని చాటుకున్నాడు. తన ప్లాన్ అమలు చేశాడు. ముందుగా మహావీర్ జైన్ ఇంటికి వెళ్లి యజమాని బంగారం తీసుకురమ్మన్నాడని అడిగాడు.
షాపులో గుమాస్తానే అడిగాడు కనుక మహావీర్ భార్య అనుమానం లేకుండా 2 బ్యాగుల్లో 10 కిలోల బంగారాన్ని ఇచ్చింది. అది ప్యాక్ చేసుకున్నాడు. షాపులో యజమాని బ్యాంకు ఖాతాకు చెందిన ఖాళీ చెక్కును కూడా తీసుకున్నాడు. ఖాళీ చెక్కుపై మహావీర్ జైన్ సంతకం ఫోర్జరీ చేసి పోరంకిలోని ఓ బ్యాంకు నుంచి రూ.4 లక్షల 60వేలు డ్రా చేసుకున్నాడు.
ఆ రెండూ తీసుకుని, కుటుంబంతో సహా తన ఊరు పారిపోయేందుకు సిధ్దమయ్యాడు. డబ్బు డ్రా చేయటం తెలుసుకున్న మహవీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట హర్ష సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.