వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య

ప్రతిరోజు తాగి వచ్చి హింసిస్తున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేక హత్య చేసింది. భర్త గుండెపోటుతో మృతి చెందాడని నమ్మించాలనుకుంది. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో హత్యేనని తేలింది. దీంతో తుకారంగేటు పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఆజాద్ చంద్రశేఖర్‌నగర్ బస్తీకి చెందిన బండారు రవికుమార్ (50)కు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబం కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే నిత్యం మద్యం సేవించి రవికుమార్.. భార్య, పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. భార్యను వేధిస్తూ కొడుతున్నాడు.
ఈ క్రమంలో డిసెంబర్ 26న మద్యం సేవించి ఇంటికొచ్చిన రవికుమార్.. భార్య పద్మావతితో గొడవకు దిగిల ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పద్మావతి.. నైలాన్ తాడుతో భర్త గొంతుకు బిగించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబాన్ని, చుట్టుపక్కల వారిని నమ్మించింది పద్మావతి. కుమారుడికి అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో రవికుమార్ గుండెపోటుతో కాదు.. గొంతు నులిమి చంపబడినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపు లోకి తీసుకుని విచారించగా.. భర్త చిత్రహింసలు భరించలేకనే చంపినట్లు ఒప్పుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.