బంధువులు రావొద్దన్నారు..లారీ చోరీ చేసి కరోనా పరీక్షకు వెళ్లాడు

కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు చనిపోతున్నా..జరగాల్సిన చివరి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. కరోనా భయంతో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారిని రావొద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా..క్వారంటైన్ కేంద్రంలోనే ఉండాలని చెబుతున్నారు.
ఇలాగే ఓ వ్యక్తికి చెప్పారు. అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఏకంగా లారీ చోరీ చేసి కరోనా పరీక్షకు వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తిరువారూరు జిల్లా తిరుత్తురై పూండి ఉప్పుకుళ వీధికి చెందిన రామకృష్ణన్ గత మూడో తేదీన తిరుత్తరై పూండి – వేదై రోడ్డులోని లారీ యజమానుల సంఘం భవనం సమీపాన నిలిపి ఉంచిన తన లారీ చోరీకి గురైందని పోలీసులకు తెలిపాడు. దీంతో DSP పళని స్వామి, ఇన్స్ పెక్టర్ అన్భళగన్, SIలు ఫ్రాన్సిస్, రాజేంద్రన్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
2020, జులై 04వ తేదీన తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సమీపాన ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఎదుట లారీ ఎవరు ఆపారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో…బుధవారం తిరుత్తురైపూండి కొత్త బస్టాండు ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో సంచరిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా..అసలు విషయాలు బయటపడ్డాయి.
కూత్తానల్లూరు సమీపంలోని పులియంకుడి నడి వీధికి చెందిన తంగరాజ్ కుమారుడు అశోక్ (25) గా గుర్తించారు. విచారణలో కరోనా పరక్ష కోసం లారని చోరీ చేసినట్లు తెలిసింది. చెన్నైలోని ప్రైవేటు సంస్థలో డ్రైవర్ గా అశోక్ పనిచేస్తున్నాడు. కర్ఫ్యూ కారణంగా..సొంతూరుకు వచ్చేందుకు నిర్ణయించుకున్నాడు.
సరుకు లారీల ద్వారా..పూండీకి వచ్చాడు. అక్కడున్న బంధువులు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ..కరోనా వైరస్ కారణంగా..ఇంట్లోకి అనుమతినివ్వలేదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుత్తురైపూండి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయాలని కోరాడు.
అక్కడున్న వైద్యులు ఉదయాన్నే పరీక్షలు చేస్తామని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటే..తిరువారూరు ప్రభుత్య వైద్య కళాశాలకు వెళ్లాలని చెప్పి పంపించేశారు. కానీ..అక్కడకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపొవడంతో లారీని చోరి చేసినట్లు అశోక్ వెల్లడించాడు. నాగపట్టణం పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు.