మద్యం మత్తులో : వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 01:52 AM IST
మద్యం మత్తులో : వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య

Updated On : April 23, 2019 / 1:52 AM IST

చిత్తూరు : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు ప్రాణం తీసింది. తాగిన మైకంలో ఓ యువకుడు తమాషా చేయబోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాదం జరిగింది. శివకుమార్(26) అనే యువకుడు ఆదివారం(21,2019) రాత్రి బాగా తాగాడు. అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ కి వీడియో కాల్‌ చేశాడు. వారి ఆటపట్టించేందుకు తాను చనిపోతున్నా అని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న అతను నిజంగానే ఉరి బిగించుకొని ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే శివకుమార్ ఆత్మహత్య చేసుకుంటాడని అతని స్నేహితులు ఊహించలేకపోయారు. ఏదో తమాషా చేస్తున్నాడని అనుకున్నారు. వీడియోకాల్ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది.

ఊరి వేసుకుంటున్నట్టు శివకుమార్ తన మెడకు చీరతో ముడివేశాడు. కాలు కింద పెట్టాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకుంది. శివకుమార్ ఆ ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే చీర మెడకు బిగుసుకుపోయింది. ఊపిరి ఆడక క్షణాల్లోనే ప్రాణం పోయింది. లైవ్ లో ఇదంతా చూసిన ఫ్రెండ్స్ షాక్ తిన్నారు. ఈ ఘటన శివకుమార్ కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫుల్లుగా మద్యం తాగాడు.