ఆత్మహత్యలు వద్దు : తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలపై బాబు విచారం

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార్కులు వచ్చి మరికొన్ని సబ్జెక్టుల్లో 2, 0 మార్కులు వేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈ వార్తలను తనను బాధించాయని సీఎం బాబు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
‘తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయ. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్ధులకు విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు..అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవన్నారు బాబు.
‘పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి.
మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే బహుమతి’. అంటూ బాబు ట్వీట్‌లో తెలిపారు.
– ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ అంశం కోర్టు వరకు చేరుకుంది.
– ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు గ్లోబరీనా సీఈవో రాజు. ఇంటర్ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన తెలిపారు.
– ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అపోహలను నమ్మొద్దని విద్యార్థులను మంత్రి కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
– ఇంటర్ బోర్డ్ దగ్గర అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. కార్యాలయం సమీపంలోకి విద్యార్ధులు, తల్లిదండ్రులను రాయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమకున్న అనుమానాలను నివృత్తి చేయటానికి కూడా ఏ అధికారి కూడా అందుబాటులో లేరని వారు వాపోతున్నారు.
– టాపర్స్‌గా మార్కులు సాధించిన విద్యార్ధులకు కూడా 4, 5 మార్కులు ఎలా వస్తాయని స్టూడెంట్స్, తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
– చదువుకున్న వారికి- చదువు రాని వారికి ఒకే మార్కులు రావటం ఏంటని ప్రశ్నించారు. చదువురాని వాళ్లతో పేపర్లు దిద్దారని.. కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై తీరుపై మండిపడుతున్నారు