ఏపి ‘సచివాలయ’ ఉద్యోగాల నోటిఫికేషన్!

ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16వేల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు (జనవరి 10, 2020)న నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ సచివాలయాల్లో పోస్టులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఖాళీల్లో చాలావరకు గత నియామకాల్లో భర్తీకాని పోస్టులే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వెటర్నరీ విభాగంలో 7వేల ఖాళీలు ఉండగా.. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 1746, విలేజ్ సర్వేయర్ పోస్టులు 1234, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1122 ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయాల్లో 3 వేల వరకు పోస్టులు ఉన్నాయి.
అయితే రాష్ట్రంలో కొత్తగా మరో 300 సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. పాతపోస్టులతో కలిపి దాదాపు 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది.