ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎంసెట్ : పెరిగిన విద్యార్థుల హాజరు శాతం

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ విడుదల చేశారు. గురువారం (ఏప్రిల్ 25, 2019)న మెడికల్, అగ్రికల్చర్ ‘కీ’ విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేయనున్నారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 115 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీలో 109, తెలంగాణలో 6 సెంటర్లున్నాయి. ఉదయం 10 గంటలకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 95 వేల 7 వందల 23 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86 వేల 9 వందల 10 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారికి బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రను, ఫొటోను స్వీకరించారు.