తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్

చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడం ఎక్కడా జరుగదని తెలిపారు. టెక్నికల్ అవగాహన లోపంతో మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చాయన్నారు. ఇంటర్ బోర్డు చెక్కుచెదరలేదని..పారదర్శకంగానే చేస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆయన వివరణ ఇచ్చారు.
ఇంటర్ బోర్డు పారదర్శకంగా మూల్యాంకనం చేసిందన్నారు. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయని ..వాటిని సరి చేస్తామన్నారు. బబ్లింగ్ లో టోటల్ మార్కుల దగ్గర 99 వేయాల్సి ఉండగా 00గా వేశారని తెలిపారు. తప్పులు దొర్లిన ముగ్గురు విద్యార్థుల మార్కులు సవరించామని తెలిపారు. ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయడంలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతు కాలేదన్నారు. పోలీసుల నిఘా మధ్య జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయని తెలిపారు. పాసైన వారు ఫెయిల్ అయినట్లు ఎక్కడా చూపించలేదన్నారు.
బార్ కోడ్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఓఎంఆర్ షీట్లు ఉంటాయని. ..పార్టీ 3 లో బబ్లింగ్ ఉంటుందని తెలిపారు. నవ్య అనే అమ్మాయికి 99 మార్కులు వస్తే ఎగ్జామినర్ 00 గా బబ్లింగ్ చేశారని చెప్పారు. ఎగ్జామినర్, స్క్రూటినైజర్ చూసుకోలేదన్నారు. వెంటనే సరిదిద్దామని… విద్యార్థినికి కూడా సమాచారం ఇచ్చామన్నారు. నవ్యకు సంబంధించి పెద్ద తప్పు జరిగిందని.. ఆమె పేపరును తెప్పించుకుని పరిశీలించి.. సవరించామని తెలిపారు. తప్పు చేసిన ఇద్దరిపైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేస్తే చార్జ్ మెమోతోపాటు పెనాల్టీ కూడ ఉంటుందన్నారు. అవకతవకలు జరిగి ఉంటే జవాబు పత్రం ఇస్తామని చెప్పారు. తమ నుంచి తప్పు లేదనడం లేదన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉంటుందన్నారు. రివాల్యుయేషన్ ఉంటుందా? ఉండదా.. ? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.