Assembly Elections 2023: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతను హత్యచేసిన నక్సలైట్లు

దూబే తన కారు వైపు పరిగెత్తారు. కారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే మరికొందరు ఆయనను చుట్టుముట్టారు. పదునైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. దీని కారణంగా ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.

Assembly Elections 2023: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతను హత్యచేసిన నక్సలైట్లు

Updated On : November 5, 2023 / 3:58 PM IST

Ratan Dubey: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నేటికీ కత్తిమీద సాముగానే ఉన్నాయి. నక్సల్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రక్రియ ముగించడం పెద్ద సవాల్. ఎన్నికలు జరిగే ప్రతీసారి అమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందకు కారణం నక్సల్స్. రాజకీయ నాయకుల్ని, పోలింగ్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిపై నక్సల్స్ తరుచూ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియకు అడ్డుతగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత నారాయణపూర్ జిల్లాలో శనివారం బీజేపీని నాయకుడైన రతన్ దూబేను హత్య చేశారు. జిల్లాలోని ఝరా ఘాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్నార్ గ్రామ సమీపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, నారాయణపూర్ జిల్లా పంచాయతీ సభ్యుడైన రతన్ దూబేపై అనుమానిత నక్సలైట్లు పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

గుంపులో నుంచి వచ్చి దాడి
నారాయణపూర్ పట్టణానికి చెందిన దూబే ఎన్నికల ప్రచారం కోసం ఝరా వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు ఆయనపై నక్సలైట్లు దాడి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రమైన నారాయణపూర్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దూబే ఒక సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు గుంపులో నుంచి బయటకు వచ్చి వెనుక నుంచి తలపై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఏమన్నారు?
“దూబే తన కారు వైపు పరిగెత్తారు. కారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే మరికొందరు ఆయనను చుట్టుముట్టారు. పదునైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. దీని కారణంగా ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. అనంతరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తగిన భద్రత కల్పించామని, అయితే ఈ విషయంలో దూబే పర్యటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’’ అని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ పుష్కర్ శర్మ తెలిపారు.

కాంగ్రెస్ పై అరుణ్ సావో ఆరోపణలు
బీజేపీ కార్యకర్తలంతా దూబే కుటుంబంతోనే ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌సావో అన్నారు. ‘‘నక్సలిజాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న లక్షిత హత్యల పరంపరలో రతన్‌ దూబేపై నక్సలైట్‌ దాడి మరో కొత్త కోణం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేశాం. అందుకే హింసను ప్రోత్సహించడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించే బాధ్యతను పరోక్షంగా నక్సలైట్లకు అప్పగించారు’’ అని అరుణ్ సావో ఆరోపించారు.

ఆరో బీజేపీ నేత హత్య
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నక్సలైట్లుగా అనుమానిస్తున్న బీజేపీ నేతను హత్య చేయడం ఇది ఆరోసారి. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తున్నారని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబరు 20న మోహ్లా-మాన్‌పూర్-అంబగఢ్ చౌకీ జిల్లాలోని సర్ఖేడా గ్రామంలో బీజేపీ కార్యకర్త బిర్జు తారామ్‌ను అనుమానిత మావోయిస్టులు కాల్చి చంపారు. మన్పూర్ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెలలో బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని ‘సున్నితమైన’, ‘మరింత సున్నితమైర’ పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని కూడా పార్టీ డిమాండ్ చేసింది.