Assembly Elections 2023: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు ఖాతా ఎందుకు తప్పనిసరిగా ఉండాలో తెలుసా?

అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో చేసిన అన్ని ఖర్చుల వివరాలను బ్యాంకు ఖాతా ద్వారా తప్పనిసరిగా ఇన్‌స్పెక్టర్ ముందు సమర్పించాలని ఎన్నికల సంఘం నియమం విధించింది

Assembly Elections 2023: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకు ఖాతా ఎందుకు తప్పనిసరిగా ఉండాలో తెలుసా?

Updated On : October 26, 2023 / 4:27 PM IST

Assembly Elections 2023: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు విపరీతంగా ఖర్చు చేయడం సహజం. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఖర్చు చేయకుండా, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుండటం తరచుగా కనిపిస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఖర్చు పరిమితిని రూ.40 లక్షలుగా నిర్ణయించారు. అంతకు మించి ఖర్చు చేస్తే ఎన్నికల నుంచి సదరు అభ్యర్థిని తొలగిస్తారు. దీనితో పాటు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం, అభ్యర్థులందరూ 30 రోజుల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అందువల్ల నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు కొత్త బ్యాంక్ ఖాతా తెరవడం తప్పనిసరి.

ఎన్నికల ఖర్చులన్నీ కొత్త బ్యాంకు ఖాతా నుంచే
అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో చేసిన అన్ని ఖర్చుల వివరాలను బ్యాంకు ఖాతా ద్వారా తప్పనిసరిగా ఇన్‌స్పెక్టర్ ముందు సమర్పించాలని ఎన్నికల సంఘం నియమం విధించింది. ఇందుకోసం ఎన్నికల సమయంలో అయ్యే ఖర్చులన్నింటినీ నిర్ణీత ఫార్మాట్‌లో రిజిస్టర్‌లో ఉంచి గడువు తేదీలోగా ఎన్నికల వ్యయ పరిశీలకుల ముందు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో అభ్యర్థి బ్యాంకు ఖాతా సమాచారాన్ని కూడా రిటర్నింగ్ అధికారికి అందించాలి. ఎన్నికల సమయంలో అన్ని రకాల ఖర్చులకు బ్యాంకులో తెరిచిన ఖాతా నుంచే డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది.

రూ.20 వేలకు మించి నగదు చెల్లింపు ఉండకూదు
అభ్యర్థికి ఇతరుల నుంచి వచ్చిన డబ్బును విడిగా తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. దాని నుంచి ఖర్చు చేయాలి. ఈ బ్యాంక్ ఖాతాను అభ్యర్థి స్వయంగా లేదా అతని ఎన్నికల ఏజెంట్‌తో కలిసి ఓపెన్ చేస్తారు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ నగదు రూపంలో చెల్లించవలసి వస్తే, అతను బ్యాంకు నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ20 వేల వరకు నగదు చెల్లించవచ్చు. దీని కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కు, డ్రాఫ్ట్, RTGS, NEFT ద్వారా మాత్రమే చెల్లించాలి.