MLA Shankar Nayak: అభివృద్ధి ఎక్కువగా చేశారని ప్రచారానికి రావొద్దంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు
మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఓటు అడగాల్సిన పని లేదు. మా ఓట్లన్నీ మీకే, కారు గుర్తుకే. మా మీద నమ్మకం ఉంచి, దయచేసి మీరు మా గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ప్రచారం చేయండి. ఒట్టేసి చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం

Assembly Elections 2023: ఎన్నికల్లో గెలిచి తమ సమస్యలు పట్టించుకోలేదని నాయకులను అడ్డుకోవడం తరుచూ చూస్తూనే ఉంటాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో ఇందుకు పూర్తిగా విరుద్ధమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. తమ గ్రామంలో అభివృద్ధి చాలా జరిగిందని ఇక ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటూ బొద్కగొండ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమయం తక్కువగా ఉందని, తమ గ్రామంలో ప్రచారం చేయకపోయినా ఓట్లేస్తామని, ఈ సమయంలో ఇతర గ్రామాల్లో ప్రచారం చేసుకొమ్మంటూ అందులో రాసుకొచ్చారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఎదురైన ఘటన ఇది. ఆ ఫ్లెక్సీలో ‘‘గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు.. మీ సమయం అమూల్యమైంది. మీకు ప్రతి నిమిషం విలువైంది. మీరు ప్రచారం చేయాల్సిన గ్రామాలు చాలా మిగిలి ఉన్నాయి. మా బొద్కగొండ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. మా మనసు దోచారు. మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఓటు అడగాల్సిన పని లేదు. మా ఓట్లన్నీ మీకే, కారు గుర్తుకే. మా మీద నమ్మకం ఉంచి, దయచేసి మీరు మా గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ప్రచారం చేయండి. ఒట్టేసి చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. మా ఓట్లన్నీ మీకే శంకరన్న’’ అని రాసుకొచ్చారు.
ఇది ముక్క లక్ష్మణ్ రావు అనే బీఆర్ఎస్ కార్యకర్త పేరుతో ఏర్పడింది. దీంతో తమకు తామే అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకుంటున్నారంటూ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఫ్లెక్సీ కనిపించడం చాలా ఆసక్తిని రేపుతోంది.