Assembly Elections 2023: గెహ్లాట్-పైలట్ మధ్య ఘర్షణ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? సర్వేలో ప్రజలు ఏం చెప్పారంటే?

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్‌ ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు

Assembly Elections 2023: గెహ్లాట్-పైలట్ మధ్య ఘర్షణ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? సర్వేలో ప్రజలు ఏం చెప్పారంటే?

Updated On : October 16, 2023 / 12:11 PM IST

Sachin Pilot vs Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. నవంబర్ 25న ప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేయనున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవడం పెద్ద విషయం. ఇద్దరు అగ్ర నేతల మధ్య ఉన్న ఘర్షణ కారణంగా అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేయడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు. అయితే గెహ్లాట్-పైలట్ మధ్యనున్న పోరు వల్ల కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందా, అయితే అది ఎంత? అనే దానిపై సర్వే చేయగా రాజస్థాన్ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

పార్టీలో అంతర్గత పోరు ముగిసిందని, ఇప్పుడు అంతా సవ్యంగానే ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నా, అభ్యర్థుల జాబితా జాప్యం మాత్రం మరోటి సూచిస్తోంది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్‌ ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 15 మధ్యాహ్నం వరకు నిర్వహించిన సర్వేలో 2649 మంది వ్యక్తుల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: యుద్ధంలోకి ఇరాన్! వేలు ట్రిగ్గర్ మీదే ఉందంటూ ఇజ్రాయెల్‭కు తీవ్ర బెదిరింపులు

ఈ ప్రజాభిప్రాయం కాంగ్రెస్‌కు టెన్షన్‌ను కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు (సుమారు 53 శాతం మంది) ఇద్దరూ పెద్ద ప్రజా నాయకులని వారి పోరాటం కాంగ్రెస్‌ను చాలా దెబ్బతీస్తుందని చెప్పారు. అదే సమయంలో ఇది కాంగ్రెస్‌కు కొంత నష్టం కలిగించవచ్చని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందన్న భయంతో సర్వేలో పాల్గొన్న 69 శాతం మంది ఉన్నారు. అయితే ఇద్దరు నేతల మధ్య పోరు ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపదని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.

గెహ్లాట్-పైలట్ పోరు వల్ల రాజస్థాన్ కాంగ్రెస్‌కు ఎంత నష్టం?
చాలా ఎక్కువ నష్టం – 53%
కొంత నష్టం – 16%
నష్టమేమీ లేదు – 29%
చెప్పలేము – 2%