రాష్ట్రంలో పెరుగుతున్న ఎయిడ్స్ మరణాలు : ఏడాదిలో 4,250 మంది బలి

దేశవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మొదటి స్ధానంలో మహారాష్ట్ర
2018– 19 ఆర్థిక సంవత్సరంలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి నాటికే 4,278 మంది చనిపోయినట్లు లెక్కలు చెపుతున్నాయి. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు.
ఎలా వ్యాప్తి చెందుతోంది
సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్‌నాథ్ తెలిపారు.
Read More>>లక్షా 50 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్