డోంట్ ఫియర్ : ఆ 9వేల మందిలో కరోనా వైరస్ లేదు!

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 04:46 PM IST
డోంట్ ఫియర్ : ఆ 9వేల మందిలో కరోనా వైరస్ లేదు!

Updated On : January 22, 2020 / 4:46 PM IST

కొన్నాళ్ల వరకు ప్రపంచ దేశాలను స్వైన్ ఫ్లూ.. జికా వైరస్ వరుసగా వణికించాయి. ఇప్పుడు నోవెల్ కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రబలడంతో వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకూ అక్కడ 41 మంది న్యూమోనియా బారినపడ్డారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. చైనా నుంచి ఇండియాకు వచ్చిన 9,156 మంది ప్రయాణికుల్లో ఎవరికి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించింది. మొత్తం 43 విమానాల్లో వచ్చిన వేలాది మంది ప్రయాణికుల్లో నోవల్ కరోనా వైరస్ జాడ లేదని తెలిపింది. 

7 ఎయిర్ పోర్టుల్లో స్ర్కీనింగ్ టెస్టులు :
దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా 7 విమానాశ్రయాలకు మంగళవారం వేలాది మంది ప్రయాణికులు చేరుకున్నారు. ఈ ప్రయాణికులందరికి పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిలో ఎవరికి కూడా కరోనా వైరస్‌ సోకిన ఆనవాళ్లు లేవని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్ర్కీనింగ్ ద్వారా జరిపిన పరీక్షల్లో ఇప్పటివరకూ ఎలాంటి కరోనా వైరస్ జాడ కనిపించలేదని ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూదన్ తెలిపారు. చైనాలోని భారత రాయబారి కార్యాలయంలో కూడా ఈ వైరస్ సోకిన కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ అందిస్తున్నట్టు ప్రీతి చెప్పారు. 

440మందికి సోకిన వైరస్.. 9 మంది మృతి :
చైనా నుంచి 43 విమానాల్లో భారత్ కు వచ్చిన 9వేల 156 మంది ప్రయాణికుల్లో నోవల్ కరోనా వైరస్ (nCov) లేదని స్ర్కీనింగ్ లో నిర్ధారణ అయినట్టు తెలిపారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా.. nCov కేసులు ఏమి నిర్ధారణ కాలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటివరకూ నోవల్ కరోనా వైరస్ బారిన పడి న్యూమోనియాతో మొత్తం 440 కేసులు నమోదు కాగా, బుధవారం నాటికి 9 మంది మృతిచెందారని చైనాలోని భారత రాయబారి కార్యాలయం ధ్రువీకరించినట్టు సూదన్ వెల్లడించారు. తైవాన్ సహా 14 ప్రావిన్స్, మున్సిపాలిటీల్లోనూ ఇదే వైరస్ కేసులు నమోదు అయినట్టు హెల్త్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.