నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ సక్సెస్.. మరో ఇద్దరికి రెండో డోస్..!

  • Published By: sreehari ,Published On : July 22, 2020 / 04:39 PM IST
నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ సక్సెస్.. మరో ఇద్దరికి రెండో డోస్..!

Updated On : July 22, 2020 / 4:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్‌ నిరోధించడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన (covaxin) కొవాక్జిన్‌ను ఇద్దరు వలంటీర్లకు ప్రయోగించారు.

ఇప్పుడు మరో ఇద్దరికి రెండో డోస్ ఇవ్వనున్నారు. తొలి డోస్ తీసుకున్న వలంటీర్లలో ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని డిశ్చార్జి చేసినట్టు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు డోస్ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్‌లోని కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తామని అంటున్నారు. అనంతరం వారిని మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్‌) వైరస్‌ వల్ల శరీరంలో యాంటీబాడీస్‌ ఏ మేరకు వృద్ధి చెందాయనేది గుర్తించాల్సింది ఉందన్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు.

అనుకున్నట్టుగా జరిగితే రెండో డోస్‌ వ్యాక్సిన్ కూడా ఇస్తామని అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర అనారోగ్య సమస్యలు గుర్తించలేదన్నారు. కొవాక్జిన్‌ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌లో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్‌ క్లినికల్, వైద్యులు చెబుతున్నారు.

నిమ్స్‌ వైద్యులు 13 మంది వలంటీర్ల బ్లడ్ శాంపిల్స్‌ను ఢిల్లీలోని ICMR ఆమోదించిన ల్యాబ్‌కు పంపించారు. వీరిలో 8 మందికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేశారని సమాచారం. వీటి ఆధారంగానే మరో ఇద్దరికి టీకా డోస్‌ ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు.

మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఐదు డోస్‌ల మేరకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయనున్నారు. అంటే.. ఈ ఏడాది చివరిలో లేదా కొత్త ఏడాదిలో వ్యాక్సిన్‌ రావచ్చు.