చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మొదటి కేసు

చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మొదటి కేసు

Updated On : January 1, 2021 / 9:40 AM IST

China First Case New Coronavirus Variant : యూకేలో విజృంభిస్తోన్న కొత్త కరోనా వేరియంట్ మొదటి కేసు చైనాలో నమోదైంది. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక ప్రకటనలో వెల్లడించింది.  కొత్త వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ వెళ్లే అన్ని రవాణా కార్యకలాపాలపై నిషేధం విధించాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే యూకే కొత్త వేరియంట్ వైరస్ దాదాపు కొన్ని దేశాల్లోకి ప్రవేశించినట్టు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనావైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో యూకే కొత్త వేరియంట్ మొదటి కేసును గుర్తించారు. ప్రారంభంలో కరోనా వైరస్ కంటే.. ఈ కొత్త వేరియంట్ వైరస్.. అత్యంత వేగంగా వ్యాపించగలదని సైంటిస్టులు అంటున్నారు. అసలు వైరస్ కంటే 40-70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. చైనా CDC ఎడిషన్ ప్రకారం.. డిసెంబర్ 14న చైనాలోని షాంఘైలో బ్రిటన్ నుంచి చైనాకు తిరిగి వచ్చిన 23 ఏళ్ల మహిళా విద్యార్థినిలో ఈ కొత్త వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. షాంఘైలో బాధితురాలిని  క్వారంటైన్ కోసం ఎంపికచేసిన వైద్య సంస్థకు తరలించారు. బాధితురాలి కాంటాక్టులను కూడా ట్రేస్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ మొదటి కేసు చైనాలో కరోనా నివారణ, నియంత్రణకు పెద్ద ముప్పుగా సీడీసీ పేర్కొంది. డిసెంబర్ 24న మహిళా విద్యార్థిని నుంచి నమూనాలను సేకరించగా VUI202012 / 01 అనే కొత్త వేరియంట్ ఉందని గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఇతర దేశాలకు వ్యాపిస్తున్న తరుణంలో చైనా బ్రిటన్ బయటి విమానాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.