కరోనా : హైదరాబాద్‌లో 15 అనుమానిత కేసులు..9 మందికి నెగటివ్ రిపోర్టు

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి భారత్‌ని కూడా తాకడంతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాధిని నిర్ధారించే కేంద్రం పూణెలో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో వ్యాధి నిర్ధారణకు సమయం ఎక్కువగా పడుతోందని భావించిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి దేశ వ్యాప్తంగా 12 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో రెండేసి కరోనా టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా.. హైదరాబాద్, కేరళ, కోల్‌కతా, లక్నో, జైపూర్, నాగపూర్, చెన్నైలో ఒక్కొ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ టెస్టింగ్ సెంటర్లలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. వాటిలో వచ్చే ఫలితాలను మళ్లీ పూణెకు పంపాల్సి ఉంటుంది.. ఒకవేళ ఇక్కడ చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలినా.. దాన్ని డిక్లేర్ చేసే అధికారం మాత్రం పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మాత్రమే ఉంటుంది.
హైదరాబాద్‌లో 15 కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారిలో 11 మంది శాంపిల్స్ పరీక్షల కోసం పంపితే వారిలో 9 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇప్పటికే గాంధీకి కరోనా కిట్స్ చేరుకోవడంతో స్వాబ్ కిట్స్ అన్నింటిని మెడికల్ కాలేజీలో ఉంచారు. మరోవైపు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ, ఫీవర్ ఆసుపత్రి నుంచి కొంత మంది సిబ్బంది పూణెకి వెళ్లారు. వాళ్లు శిక్షణ పొందిన తర్వాత హైదరాబాద్ లో టెస్టింగ్ లు నిర్వహిస్తారు. ఇక గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో డెడికేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
జనవరి 15 తరువాత చైనా నుంచి ఎంతమంది హైదరాబాద్‌కి వచ్చారనే సమాచారాన్ని కూడా సేకరించారు. వారందరినీ జనరల్ చెకప్ కోసం గాంధీ, ఫీవర్ ఆస్పత్రికి తీసుకురానున్నారు. వచ్చిన వారిలో ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారిని ఐసోలేషన్ వార్డులో రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టి చికిత్స అందిస్తారు. మరోవైపు కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్న క్రమంలో.. సరోజిని కంటి ఆసుపత్రిలో మరో 200 బెడ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. మొత్తానికి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తామంత సిద్ధంగా ఉన్నామని వైద్యులు అంటున్నారు.
Read More : బడ్జెట్ @ 2020 – 21 : తెలంగాణకు ఏమి ఇస్తారు ? ఎంతిస్తారు ?